హైతీ అధ్యక్షుని హత్య.. కాల్చిచంపిన దుండగులు

కరేబియన్‌ దీవుల సముదాయంలోని హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్‌ మోయిస్‌ (53) హత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో (తెల్లవారితే బుధవారం) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తన ప్రయివేటు నివాసంలో ఉన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటనలో ఆయన భార్య మార్టినే మోయిస్‌ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హత్యను తాత్కాలిక ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ ధ్రువీకరించారు. ‘సాయుధ

Updated : 08 Jul 2021 11:57 IST

భార్యకు తీవ్రగాయాలు  
  అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి దారుణం  
  దేశంలోని అరాచకమే కారణం

పోర్ట్‌ ఆఫ్‌ ప్రిన్స్‌: కరేబియన్‌ దీవుల సముదాయంలోని హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్‌ మోయిస్‌ (53) హత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో (తెల్లవారితే బుధవారం) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తన ప్రయివేటు నివాసంలో ఉన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటనలో ఆయన భార్య మార్టినే మోయిస్‌ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హత్యను తాత్కాలిక ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ ధ్రువీకరించారు. ‘సాయుధ కమాండో గ్రూపు’ సభ్యులే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ గ్రూపులో కొన్ని విదేశీ వ్యక్తులకు ప్రమేయం ఉందని అన్నారు. ఇంగ్లిష్‌, స్పానిష్‌ భాషలు మాట్లాడిన విదేశీయులే ఇందుకు పాల్పడినట్టు తెలిపారు. ఇది ‘విద్వేషపూరితం, అమానుషం, ఆటవికం’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ బాధ్యతలను తానే నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

దేశంలోని పేదరికం, అవినీతి, రాజకీయ అస్థిరత, ధరలు ముఖ్యంగా పెట్రోలు పెరుగుదల, ఆర్థిక తిరోగమనం, అభద్రత ఇందుకు కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఆహారం, ఇంధనం లభ్యత కష్టతరంగా మారింది. ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత పేద దేశమైన హైతీలో అయితే నిరంకుశత్వం, లేదంటే రాజకీయ అస్థిరత అన్ని చందంగా పరిస్థితులు ఉంటున్నాయి. రాజధాని పోర్ట్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ సహా పలు చోట్ల సాయుధ ముఠాల కిడ్నాప్‌లు, దౌర్జన్యాలు సర్వసాధారణంగా మారాయి. రాజధానిలో వీధులపై ఆధిపత్యం కోసం ఈ ముఠాల మధ్య ఘర్షణలు కూడా ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు పోలీసులతోనూ తలబడ్డాయి. ఈ కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడం కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నాయి. పార్లమెంటు లేకుండానే అధ్యక్షుడు పాలన సాగించడం కూడా తీవ్ర అసంతృప్తికి కారణమయింది.

ఆది నుంచీ వివాదాస్పదుడే
ప్రకృతి వైపరీత్యాల సహా వివిధ సమస్యలు దేశాన్ని పీడిస్తున్న నేపథ్యంలో వ్యాపారవేత్త అయిన మోయిస్‌ 2015లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దేశాన్ని పునర్నిర్మిస్తానంటూ హామీలు ఇచ్చారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పలు ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తానని తెలిపారు. ఎన్నికల నిర్వహణ సమయంలోనే వివాదాలు ఏర్పడ్డాయి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే తొలి దశ ఎన్నిక అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజాందోళనలు జరిగాయి. 2016లో జరిగిన రెండో రౌండు ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపైనా నిరసనలు వెల్లువెత్తాయి. చివరకు కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఆయన 2017 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష పదవికి అయిదేళ్ల కాలపరిమితి కాగా, అది ఇప్పుడు వివాదాస్పదమయింది. తన పదవీకాలం 2022 ఫిబ్రవరి 7 వరకు ఉందని మోయిస్‌ వాదించారు. అయితే ఎన్నికలు నిర్వహించిననాటి నుంచి లెక్కవేసుకుంటే అది 2021 ఫిబ్రవరి 7కే పూర్తయిందని విపక్షాలు అంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం పదవి చేపట్టిన తేదీ కాకుండా, ఎన్నికయిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నాయి. తన పదవీ కాలంలో స్థానిక సంస్థల దగ్గర నుంచి పార్లమెంటు వరకు దేనికీ ఎన్నికలు జరపలేదు. ప్రస్తుతం పార్లమెంటు కూడా లేదు. అధ్యక్ష ఎన్నికలనూ జరడపం లేదు. దాంతో ఆయనపై వ్యతిరేకత తారాస్థాయికి పెరిగింది. ఏ సంక్షోభాన్నీ పరిష్కరించలేకపోవడంతో అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తమయింది. దీన్ని గమనించి నాలుగేళ్లలో ఏడుసార్లు ప్రధానులను మార్చారు. మూడు నెలల క్రితం నియమించిన ప్రస్తుత ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ను తొలగించి ఈ వారంలోనే ఏరియల్‌ హెన్రీ (71)ని నియమించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులను ఆడిట్‌ చేసే అధికారాన్ని కోర్టుల నుంచి తొలగించడం, కేవలం అధ్యక్షునికే సమాచారం ఇచ్చే విధంగా నిఘా వ్యవస్థను నెలకొల్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటితోపాటు అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. చట్టప్రకారం కాలపరిమితి పూర్తియినందున గద్దె దిగాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హత్య జరగడంతో ఆ దేశం మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్టయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని