PM Modi: డీప్‌ఫేక్‌ ఆందోళనకరం.. ప్రజలకు ఉపయోగకరంగా ఏఐ అభివృద్ధి జరగాలి: ప్రధాని మోదీ

ఏఐతో తలెత్తున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. 

Updated : 22 Nov 2023 18:56 IST

దిల్లీ: సమాజంలో ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధ (AI) చేరువ కావాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా దాని అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. జీ20 దేశాధినేతల వర్చువల్‌ భేటీ (G20 Virtual Summit)ని ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐతో తలెత్తున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు జీ20 దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

‘‘డీప్‌ఫేక్‌ ఆందోళనకరం. ఇటీవలి కాలంలో కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తూ.. కొంతమంది నటులు, సమాజంలో ప్రభావశీల వ్యక్తుల నకిలీ చిత్రాలు రూపొందించి ప్రచారం చేశారు. దాంతో ప్రజలకు, సమాజానికి ముప్పు పొంచి ఉంది. నేరగాళ్లు దాన్ని దుర్వినియోగం చేయకుండా నియంత్రించాలి. ఏఐ నియంత్రణపై భారత్‌ ఆలోచన స్పష్టంగా ఉంది. ఇందుకోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని తెలిపారు. 

ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి ఆందోళనకరమని ప్రధాని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదన్నారు. ఈ ఘర్షణల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రతి ఒక్కరు తప్పక ఖండించాలన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో బందీల విడుదలను స్వాగతిస్తున్నామన్న ప్రధాని, త్వరలోనే మిగిలిన బందీలు సురక్షితంగా విడుదల కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే, ఈ యుద్ధం ప్రాంతీయ ఘర్షణగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని