Ayodhya Ram Mandir: రాముడి ప్రాణప్రతిష్ఠ.. 500 ఏళ్ల లోతైన గాయానికి మందు: అమిత్‌ షా

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో బాబర్‌ కాలంలో మన హృదయాలకు ఏర్పడ్డ లోతైన గాయాలకు మందు వేసినట్లు అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. 

Updated : 24 Jan 2024 06:13 IST

అహ్మదాబాద్‌: ఆయోధ్య రామజన్మభూమి (Ayodhya Ram Mandir)లో జరిగిన బాలరాముడి (Ram Lalla) ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. 500 ఏళ్ల క్రితం మొగల్‌ పాలకుడు బాబర్‌ కాలంలో ఏర్పడ్డ లోతైన గాయానికి మందు వేసినట్లు అయిందని హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) అభివర్ణించారు. అహ్మదాబాద్‌లోని రణిప్‌లో పునర్‌నిర్మించిన శ్రీరామ మందిర పునఃప్రాణప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్య రామమందిరంలో జరిగిన బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని అద్భుతమైన పనిచేశారు. 500 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులు ఈ క్షణం కోసమే వేచి ఉన్నారు. అయోధ్యలో కొలువైన రాముడు టెంట్‌ నుంచి ఆలయంలోకి ఎప్పుడు వెళతాడని గతంలో అడిగేవారు. ఈ భవ్యమందిరానికి ఇప్పుడు రాముడు తరలివెళ్లడంతో బాబార్‌ కాలంలో మన హృదయాలకు పడిన లోతైన గాయానికి ఇప్పుడు మందు వేసినట్లు అయిందని’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. 

‘‘మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మతవిశ్వాసాలు, భాషలను గౌరవించడానికి 2014 కంటే ముందున్న ప్రభుత్వాలు భయపడేవి. ఔరంగాజేబ్‌ కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని ధ్వంసం చేస్తే.. దాన్ని పునర్‌నిర్మించి, కారిడార్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని మోదీయే. అయోధ్య రామమందిరాన్ని బాబర్‌ ధ్వంసం చేస్తే.. ఇప్పుడు మళ్లీ భవ్యాలయాన్ని నిర్మించి ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ అద్భుత ఘట్టాన్ని జాతి జనులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రామ భక్తులు చూసి తరించిపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని