Maharashtra: ₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్‌ చేసిన ఆర్మీ జవాన్‌

Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు.

Published : 08 May 2024 11:15 IST

పుణె: లోక్‌సభ ఎన్నికల వేళ ఈవీఎం (EVM)ల పేరుతో రాజకీయ నాయకుడిని మోసగించేందుకు ఓ జవాను (Army Jawan) ప్రయత్నించాడు. ఈవీఎంను మార్చేస్తానని, అందుకు రూ.2.5కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆ నేత చాకచక్యంగా వ్యవహరించి అతడిని పోలీసులకు పట్టించాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మారుతి ధక్నే అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు పుణెలో మహారాష్ట్ర (Maharashtra) శాసనసమండలిలో ప్రతిపక్ష నేత, శివసేన (యూబీటీ - Shiv Sena UBT) నాయకుడు అంబాదాస్‌ దన్వేను కలిశాడు. నిర్దిష్ట అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

దీంతో దన్వే అతడి గురించి పోలీసులకు సమాచారమిచ్చాడు. నిందితుడిని ఆధారాలతో పట్టించేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. మంగళవారం సాయంత్రం దన్వే సోదరుడు రాజేంద్ర.. నిందితుడిని ఓ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ రూ.1.5కోట్లకు డీల్ పూర్తి చేసుకున్నట్లు అతడిని నమ్మించి టోకెన్‌ కింద రూ.లక్ష ఇచ్చాడు. దన్వే ఇచ్చిన సమాచారంతో అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని (Army Jawan) రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

‘‘నిందితుడికి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు ఇలా అడ్డదారిలో మోసాలకు పాల్పడేందుకు యత్నించాడు. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసులు వెల్లడించారు. అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన మారుతి ధక్నే.. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ ప్రాంతంలో ఆర్మీ (Army) బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) నేపథ్యంలో ఇటీవల ఈవీఎంల (EVM)పై అనేక సందేహాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈవీఎం ఓట్లతో 100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని, లేదా బ్యాలెట్‌ బాక్సులను ఉపయోగించాలని సుప్రీంలో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు సురక్షితమైనవేనని, ఓట్ల కోసం వాటిలో మార్పులు చేసే అవకాశమే ఉండదని ఇప్పటికే ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు