- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Azadi Ka Amrit Mahotsav: ఐక్య భారత కూలీనన్... మేనన్!
ఆయన ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్‌ల్లో చదవలేదు. ఎలాంటి రాజకీయ వారసత్వమూ లేదు. బతుకుదెరువు కోసం కూలీగా బరువులెత్తాడు. అసలు ఎలాంటి డిగ్రీలు లేనివాడు. అయినా... ముగ్గురు వైస్రాయ్‌లకు తలలో నాలుకయ్యాడని, సంస్థానాల విలీనంలో పటేల్‌కు నమ్మిన బంటయ్యాడని వింటే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ... అదే నిజం! స్వతంత్ర భారతావని నిర్మాణానికి పునాదులు వేసిన కులీనుడు... మనం మరచిన దేశభక్తుడు... వప్పాల పంగున్ని (వీపీ) మేనన్!
సంస్థానాల విలీనంతో సర్దార్ పటేల్‌కు ఉక్కుమనిషి అనే ప్రశంస లభించింది. కానీ... ఆయన్ని ఉక్కుమనిషిగా చేయడానికి బొంగరంలా తిరిగి, బొగ్గులా కరిగిన బంగారు మనిషి వీపీ మేనన్! కేరళలోని మలబారు జిల్లా భరతపుళ నదీ తీరాన ఒట్టపాలెం గ్రామంలో 1893 సెప్టెంబరు 30న జన్మించారు మేనన్. పెద్ద కుటుంబం. చాలీచాలని ఆదాయం. పెద్దకొడుకుగా తండ్రికి అండగా నిలిచేందుకు మెట్రిక్యులేషన్ కాగానే చదువును వదిలేశారు. కోలార్ వెళ్లి బంగారు గనుల్లో, భవన నిర్మాణ పనుల్లో కూలీగా చెమటోడ్చారు. ఎక్కడ నేర్చారో కానీ... ఆంగ్లభాష మీద పట్టుసాధించారు. పైగా టైపు నేర్చుకున్నారు. బెంగళూరులోని పొగాకు కంపెనీలో టైపిస్ట్‌గా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత ముంబయికి చేరి తోపుడు బండిపై తువ్వాళ్ల వ్యాపారం చేశారు. తన జీవిత ధ్యేయమైన ప్రభుత్వోద్యోగం కోసం.. 1914లో బ్రిటిష్‌వారి వేసవి రాజధాని శిమ్లా వెళ్లారు. బ్రిటిష్ హోం మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ విభాగంలో చిన్న ఉద్యోగం సంపాదించారు. చెప్పిన పనికంటే... అదనంగా పనిచేసి అల్లుకుపోయే మేనన్ తత్వం ఆంగ్లేయ అధికారులకు నచ్చింది. రాజ్యాంగ సంస్కరణల విభాగానికి బదిలీ... ఆయన జీవితాన్నే మార్చేసింది. భారత్‌లో పాలన సంస్కరణల రూపశిల్పి మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ దగ్గర పనిచేశారు. చేసే ప్రతిపనికి తన విషయ పరిజ్ఞానం మేళవించే గుణం ఆయన్ని వరుసగా ముగ్గురు వైస్రాయిలు లిన్‌లితిగో, వేవెల్, మౌంట్‌బాటెన్‌లకు దగ్గర చేసింది. ఇంగ్లండ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక భారతీయ అధికారి మేననే. 1914లో ఉద్యోగంలో చేరాక అంచెలంచెలుగా ఎదిగారు. భారత ప్రభుత్వ రాజ్యాంగ సంస్కరణల కార్యాలయంలో 1933 నుంచి 1934 వరకు అసిస్టెంట్ సెక్రటరీగా చేశారు. తర్వాత 1934 నుంచి 1935 దాకా అండర్ సెక్రటరీగా ఉండేవారు. 1935 నుంచి 1940 దాకా డిప్యూటీ సెక్రటరీగా, 1941-42లో భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఈ బాధ్యతల కారణంగా... గాంధీ, నెహ్రూ, జిన్నా, పటేల్‌లాంటి నేతలతోపాటు దేశంలోని అందరు సంస్థానాధీశులతోనూ పరిచయమున్న ఏకైక వ్యక్తిగా మేనన్ నిలిచారు. భారత చివరి వైస్రాయ్‌గా వచ్చిన మౌంట్‌బాటెన్ వద్ద రాజకీయ సంస్కరణల కమిషనర్‌గా మేనన్ నియమితులయ్యారు. తొలుత మౌంట్‌బాటెన్ దేశాన్ని అనేక ముక్కలు చేయాలని భావించాడు. ప్రతి రాష్ట్రానికి, సంస్థానానికి విలీనం లేదా... స్వతంత్రంగా ఉండే అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఈ ప్రణాళికకు అంగీకరించేది లేదని నెహ్రూ తెగేసి చెప్పారు. దీంతో... ఏమీ పాలుపోని మౌంట్‌బాటెన్ తన సలహాదారు మేనన్‌వైపు చూశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే స్వాతంత్య్ర ప్రకటన ప్రణాళికకు వీపీ మేనన్ కేవలం మూడున్నర గంటల్లో రూపకల్పన చేశారు. 1947 జున్ 3న దీన్నే మౌంట్‌బాటెన్ తన ప్లాన్‌గా ప్రకటించుకున్నాడు.
పటేల్‌తో ఉక్కు బంధం
సర్దార్ పటేలంటే మేనన్‌కెంతో అభిమానం ఉండేది. 1947లో పటేల్ నేతృత్వంలోని రాష్ట్రాల మంత్రిత్వ శాఖలో ఆయన కార్యదర్శిగా నియమితులయ్యారు. రామాంజనేయుల్లా... వీరిద్దరూ సంస్థానాల విలీనాన్ని సజావుగా పూర్తి చేశారు. తనకున్న పరిచయాలతో దేశమంతటా పర్యటించిన మేనన్... సంస్థానాధీశులందరినీ నయానోభయానో ఒప్పించి సంతకాలు పెట్టించుకొచ్చారు. మాట వినని వాళ్లను పటేల్ ముందు నిలబెట్టారు. అప్పటికీ తేలని హైదరాబాద్‌లాంటి చోట్ల మంత్రాంగం నడిపారు. హిందూ మెజార్టీ సంస్థానానికి హిందూ రాజుగా ఉండీ... పాకిస్థాన్‌లో చేరటానికి ఉత్సాహం చూపిన జోధ్‌పుర్ మహారాజు హన్వంత్‌సింగ్... తన తలకు తుపాకీ పెట్టినా వెరవకుండా పనికానిచ్చుకొచ్చిన ఘనుడు మేనన్. భారత్‌లో విలీనానికి అంగీకరించేలా కశ్మీర్ రాజుపై ఒత్తిడి తెచ్చిన ఘనతా ఆయనదే. స్వయం కృషితో శిఖర స్థాయికి చేరిన దేశమాత ముద్దుబిడ్డ చరిత్రలో నాలుగో సింహంలా కనిపించకుండా ఉండిపోయారు. పదవీ విరమణ తర్వాత ఒడిశా గవర్నర్‌గా ఏడాది కొనసాగిన వీపీ మేనన్ 1965 డిసెంబరు 31న బెంగళూరులో తన కుమార్తె ఇంట కన్నుమూశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Arvind Kejriwal: ప్రజలు పేదలుగా ఉంటే.. దేశం ధనికంగా మారదు.. కేంద్రంపై కేజ్రీవాల్ కౌంటర్
-
Sports News
Deepak - Virat : దీపక్‌కు అంత సులువేం కాదు.. కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు!
-
Politics News
CM Kcr: దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్
-
Politics News
Karnataka: మంత్రి ఆడియో లీక్ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!
-
General News
Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం