NEET Suicides: అర్థిస్తున్నా.. ఆత్మహత్యలు చేసుకోవద్దు: స్టాలిన్‌

‘నీట్‌’ పరీక్షలకు భయపడి తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కలత చెందారు.....

Published : 15 Sep 2021 23:16 IST

చెన్నై: ‘నీట్‌’ పరీక్షలకు భయపడి తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కలత చెందారు. బలవన్మరణాలకు పాల్పడకుండా ఉండాలని విద్యార్థులను అర్థించారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ‘నీట్‌’కు భయపడి ఆదివారం ధనుష్‌(20) అనే విద్యార్థి, మంగళవారం మరో విద్యార్థి(17) ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  తాజాగా బుధవారం ఓ విద్యార్థిని(17) తనువు చాలించింది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

‘మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీ జీవితాలను ముగింపు పలకొద్దు. ఏది అసాధ్యం కాదు అనే నమ్మకంతో చదవండి. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా తల్లిదండ్రులు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి’ అని స్టాలిన్‌ అభ్యర్థించారు. ఒత్తిడి, భయంలో ఉంటే 104కి డయల్‌ చేసి మాట్లాడాలని సూచించారు. ‘వైద్య విద్యను అభ్యసించాలని లక్ష్యంతో ఉన్న కొందరు ప్రతిభావంతుల ఆశలకు నీట్‌ గండికొడుతోంది. నీట్‌ రద్దు విషయంలో కేంద్రం చలనం లేని రాయిలా వ్యవహరిస్తోంది. నీట్‌ను రద్దు చేసే పరిస్థితులను మేము సృష్టిస్తాం’ అని తమిళనాడు సీఎం పేర్కొన్నారు.

నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ బిల్లును ప్రతిపాదించగా.. భాజపా మినహా అన్ని విపక్ష పార్టీలూ ఇందుకు ఆమోదించాయి. నీట్‌ పరీక్ష భయంతో పరీక్ష రాయడానికి కొన్ని గంటల ముందు విద్యార్థి ధనుష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండుసార్లు నీట్​ రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకలేకపోతానేమో అన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అనంతరం నీట్‌ మినహాయింపు బిల్లును ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని