Mamata: లోక్‌సభ ఎన్నికలకు ముందే.. విపక్ష నేతలందరి అరెస్టుకు కుట్ర!

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా (INDIA) కూటమి నేతలను అరెస్టు చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుందని మమతా బెనర్జీతోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది.

Published : 01 Nov 2023 18:54 IST

కోల్‌కతా: 2024 సార్వత్రిక ఎన్నికల (Elections 2024) కంటే ముందే విపక్ష నేతలందర్నీ అరెస్టు చేయాలని భాజపా కుట్ర పన్నుతోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. ఆ తర్వాత ‘ఖాళీ దేశంలో’ వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారన్నారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తోపాటు అనేక మందికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిందని.. ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఫోన్లు కూడా హ్యాకింగ్‌కు గురవుతున్నాయని దీదీ ఆరోపించారు.

2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారు!

‘వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే... విపక్ష పార్టీల గళాన్ని అణచివేయాలని వారు (భాజపా) ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ముందు ప్రతిపక్ష నేతలందర్నీ అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు కుట్ర పన్నుతున్నారు’ అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వచ్చే పెండింగు నిధులను నవంబర్‌ 16లోగా విడుదల చేయకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తొలుత నవంబర్‌ 1 వరకే డెడ్‌లైన్‌ విధించినప్పటికీ.. గవర్నర్‌ హామీ మేరకు కొన్ని రోజులు వేచి చూస్తామన్నారు.

ఇండియా కూటమి నేతలే లక్ష్యంగా.. 

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా (INDIA) కూటమి నేతలను అరెస్టు చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుందని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. ఈ క్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌దే తొలి అరెస్టు కానుందని మరోసారి పేర్కొంది. నవంబర్‌ 2న ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌.. ఈడీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇలా స్పందించింది. ‘విపక్షాల కూటమి ఇండియా (INDIA) ఏర్పాటుతో భాజపా ఉలిక్కిపడింది. దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో 95శాతం విపక్ష నేతలమీదే ఉన్నాయి. కూటమిలో కీలక నేతలనే భాజపా లక్ష్యంగా చేసుకుందనే విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో తొలి అరెస్టు అరవింద్‌ కేజ్రీవాల్‌దే కానుంది’ అని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా పేర్కొన్నారు.

కేజ్రీవాల్ తర్వాత ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీలను అరెస్టు చేస్తారని రాఘవ్‌ చద్దా అంచనా వేశారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ కీలక నేతలను అరెస్టు చేయనున్నారని ఆరోపించారు. దిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఓడిపోనున్నట్లు భాజపా గ్రహించిందని.. అందుకే ఆప్‌ను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసేందుకే భాజపా కుట్ర పన్నిందన్నారు. ఇలా నేతల అరెస్టుపై తృణమూల్, ఆప్‌ నుంచి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ భాజపా మాత్రం వీటిపై స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు