Mamata Banerjee: కక్ష సాధింపు చర్యలా చంద్రబాబు అరెస్టు: మమతా బెనర్జీ

ప్రతీకారం చర్యలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినట్లు కనిపిస్తోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Updated : 11 Sep 2023 17:40 IST

కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై (Chandrababu Arrest) పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రతీకార చర్యలో భాగంగానే ఆయన్ను అరెస్టు చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఐదేళ్ల తర్వాత విదేశీ పర్యటకు వెళ్తున్న సందర్భంగా.. పలు అంశాలపై దీదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

‘ఐదేళ్ల తర్వాత విదేశాలకు వెళ్తున్నాను. విదేశాల నుంచి ఇదివరకు ఎన్నో ఆహ్వానాలు వచ్చినప్పటికీ ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. దిల్లీ పోలీసులు మాకు శత్రువులు కాదు. కానీ, రాజకీయంగా ఆందోళనలకు పిలుపునిచ్చినందున అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పిస్తాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య మాదిరిగానే కనిపిస్తోంది’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక ఆమె అల్లుడు, తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీకి ఈడీ నోటీసులు పంపించడాన్ని దీదీ ఖండించారు. ఓ యువ నాయకుడిని అణచివేసేందుకు కేంద్రం ఈ తరహా చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు.

పశ్చిమబెంగాల్‌కు ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ దిల్లీలో ఆందోళన చేపట్టేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సిద్ధమైంది. రాజ్‌ఘాట్‌తో సహా మూడుచోట్ల అక్టోబర్‌ 2న ఆందోళనలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇదిలాఉంటే, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుబాయ్‌, స్పెయిన్‌లలో పర్యటించనున్నారు. మంగళవారం ఆమె ప్రయాణం మొదలుకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని