China: సరిహద్దుల్లో విస్తరిస్తున్న డ్రాగన్‌

టిబెట్‌ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌..

Published : 22 May 2021 10:30 IST

‘టిబెట్‌’ ముసుగులో అరుణాచల్, నేపాల్, భూటాన్‌ భూభాగాలకు చేరువ
 చైనా తాజా శ్వేతపత్రం చెబుతున్నదిదే!

బీజింగ్‌: టిబెట్‌ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌.. అటు నేపాల్, భూటాన్‌ భూభాగాలకు చేరువగా వస్తోంది. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా (85) వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘1951 నుంచీ టిబెట్‌.. దాని విమోచనం, అభివృద్ధి.. శ్రేయస్సు’ అంటూ దీనికి పేరు కూడా పెట్టారు. హిమాలయ ప్రాంతంలోని నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్‌ కీలకం కావడంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరిట చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాలక కమ్యూనిస్టు పార్టీ సూచనల మేరకు.. పేదరికంతో అవస్థలు పడుతున్న టిబెట్‌ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పనులకు ఏటా నిధుల కేటాయింపులు పెంచుకొంటూ వెళతామని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 2012లో జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చాక చైనా సరిహద్దుల అభివృద్ధి, కొత్త గ్రామాల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టారు. విస్తృతంగా హైవేల నిర్మాణం చేపట్టి, మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. 
దలైలామా వారసుడి ఎంపికపై తిరకాసు
టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడు ఎవరైనా తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని, అలాకాకుండా వారి ఇష్టానుసారం ఎవరో ఒకరిని వారసుడిగా నియమిస్తే గుర్తించబోమని చైనా ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. 17, 18 శతాబ్దాల్లో చైనాను పరిపాలించిన రాజుల కాలం నుంచి కూడా బౌద్ధ గురువుల వారసులకు పాలకుల ఆమోదం తప్పనిసరిగా ఉండేదని తెలుపుతూ చైనా ప్రభుత్వం  శ్వేతపత్రం విడుదల చేసింది. టిబిట్‌ ప్రాచీనకాలం నుంచీ చైనాలో అవిచ్ఛిన్న భాగమని అందులో స్పష్టంచేసింది. 1959లో టిబెట్‌ ప్రజల తిరుగుబాటును చైనా అణచివేయగా.. 14వ దలైలామాకు భారత్‌ రాజకీయ ఆశ్రయమిచ్చింది. అప్పట్నుంచీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల కేంద్రంగా టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం నడుస్తోంది. దలైలామాకు ఇపుడు వార్ధక్యం మీద పడటంతో గత రెండేళ్లుగా ఆయన వారసుడి చర్చ నడుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని