Updated : 25 Aug 2020 15:41 IST

కోలుకున్నా..రెండోసారి కరోనా!

మొదటిసారి పూర్తిస్థాయి వివరాలు నమోదు

 

హాంకాంగ్‌: కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని, తిరిగి సుమారు నాలుగు నెలల అనంతరం మళ్లీ వైరస్ బారిన పడిన ఘటన హాంకాంగ్‌లో వెలుగుచూసింది. ఈ తరహాలో పూర్తి స్థాయి వివరాలు నమోదు చేసిన మొదటి కేసుగా దాన్ని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌ పరిశోధకులు సోమవారం పేర్కొన్నారు.  

శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాంకాంగ్‌కు చెందిన 33ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌లో వైరస్‌ బారిన పడి, పూర్తిగా కోలుకొని, ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అనంతరం స్పెయిన్‌లో పర్యటించి బ్రిటన్ మీదుగా స్వస్థలానికి చేరుకున్న ఆ వ్యక్తికి ఆగస్టు 15న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, సదరు వ్యక్తికి ఇంతకుముందు సోకిన వైరస్‌కు, ప్రస్తుతం సోకిన వైరస్‌లో కొద్దిపాటి తేడాలున్నాయిని వారు గుర్తించారు. అలాగే రెండోసారి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు. ‘ఈ కొత్త నిరూపణలు వ్యాక్సిన్‌ తీసుకోవడాన్ని పనికి రాకుండా చేస్తాయనేదానికి అర్థం కాదు. వ్యాక్సిన్‌ వల్ల పొందే రోగనిరోధక శక్తి, వైరస్‌ సంక్రమించడం వల్ల సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తికి తేడా ఉంటుంది. వ్యాక్సిన్‌లు ఎంతవరకు ప్రభావంతమైనవో తెలుసుకోవాలంటే పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే’ అని ఆ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ కాయ్‌ వాంగ్‌ తొ వెల్లడించారు.

హాంకాంగ్‌ కేసును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఒక  నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంటువ్యాధుల నిపుణులు మారియా వాన్‌ కెర్కోవ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, చైనాలో వైరస్‌ నుంచి కోలుకోని, రెండోసారి దాని బారిన పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. హాంకాంగ్‌ కేసులో జరిగినట్లు సదరు రోగులు పూర్తిగా వైరస్‌ నుంచి కోలుకొన్న తరవాత రెండోసారి దానికి గురయ్యారా? లేక మొదటిసారి సోకిన వైరస్ ఇంకా‌ శరీరంలోనే ఉండటం వల్ల ఆ కేసులు నమోదయ్యాయా అనే విషయం మీద మాత్రం స్పష్టత లేదు. 

ఇదిలా ఉండగా.. నెదర్లాండ్స్‌, బెల్జియంకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కూడా రెండోసారి వైరస్‌ సోకిన విషయాన్ని వైద్యనిపుణులు వెల్లడించినట్లు తాజాగా డచ్‌ మీడియా సంస్థ ఎన్‌ఓఎస్‌ మంగళవారం పేర్కొంది. డచ్‌, బెల్జియం, హాంకాంగ్ కేసుల్లో రెండు సార్లు ఇన్ఫెక్షన్‌కు కారణమైన వైరస్‌ జన్యువుల్లో తేడాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి జన్యు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని డచ్‌ వైద్య నిపుణురాలు మారియన్ కూప్‌మ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. 

రెండో సారి ఇన్ఫెక్షన్‌తో సమస్యలేమిటీ..?
తాజాగా హాంకాంగ్‌ కేసులో సదరు వ్యక్తికి మార్చిలో కరోనా సోకి తగ్గిపోయింది. ఆ తర్వాత అతను ఐరోపా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో హాంకాంగ్‌ విమనాశ్రయంలో అతనికి కరోనా సోకినట్లు తేల్చారు. గతంతో అతనికి కరోనా సోకిన, తాజాగా సోకిన స్ట్రెయిన్లలో తేడాలు ఉండటంతో ఇది బయటి నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్‌గా గుర్తించారు. ఇది శరీరంలో మ్యుటేషన్‌ అయ్యే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
తాజా  కేసులో సదరు వ్యక్తికి లక్షణాలు లేకపోవడంతో మరింత  మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.

కరోనా సోకి తగ్గాక వ్యాధి ఇక సోకదని నిబంధనలు పాటించని వారికి ఇదొక హెచ్చరిక లాంటిది. ఇప్పటి వరకు కరోనా సోకితే రెండోసారి సోకదనే భ్రమల్లో చాలా మంది ఉన్నారు. దీనికి తోడు టీకా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని వారు భావిస్తున్నారు. కానీ , ఇప్పుడు రోగనిరోధక శక్తి ఎక్కువ కాలం ఉండదని తేలడంతో వ్యాధి తగ్గిన వారు కూడా టీకాలు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. డాక్యుమెంటేషన్‌ అయిన కేసు ఇదొక్కటే కావడంతో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్