Ashok Gehlot: కేంద్రమంత్రి పరువునష్టం దావా.. అశోక్‌ గహ్లోత్‌కు సమన్లు

రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన సంజీవని స్కామ్‌లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పాత్ర ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ఆరోపించారు. దీంతో షెకావత్‌ ఆయనపై పరువునష్టం దావా వేశారు.

Published : 06 Jul 2023 18:22 IST

దిల్లీ: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించిన కేసులో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ కోర్టు.. ఆగస్టు 7వ తేదీన గహ్లోత్‌ న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

రాజస్థాన్‌లో నాలుగేళ్ల కిందట భారీ కుంభకోణం వెలుగుచూసింది. సంజీవని క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ.. ఫోర్జరీ చేసిన అకౌంట్‌ షీట్లు, పేమెంట్‌ రికార్డులు, వార్షిక లావాదేవీలను చూపించి దాదాపు లక్షన్నర మంది ఇన్వెస్టర్లను మోసగించింది. రూ.900కోట్ల మేర కుంభకోణానికి పాల్పడింది. దీనిపై రాజస్థాన్‌ పోలీసులు 2019లో కేసు నమోదు చేసి ఆ సొసైటీ వ్యవస్థాపకుడు విక్రమ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో సంజీవని కుంభకోణం బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో షెకావత్‌, ఆయన కుటుంబసభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారు దోచుకున్నారని దుయ్యబట్టారు. దీంతో ఈ ఏడాది మార్చిలో కేంద్ర మంత్రి షెకావత్‌ దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రాజకీయంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిచేందుకే గహ్లోత్‌ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ పిటిషన్‌పై కోర్టు నేడు విచారణ జరిపి గహ్లోత్‌కు సమన్లు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని