Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!

వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది వేర్పాటువాదుల (Khalistani Separatists) ఆస్తులను జప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సిద్ధమయ్యింది.

Updated : 24 Sep 2023 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్‌ఐఏ.. వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల (Khalistani Terrorists) ఆస్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

వివిధ దేశాల్లో ఉంటూ భారత్‌లో వేర్పాటువాదంపై ఖలిస్థాన్‌ సానుభూతిపరులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. బ్రిటన్‌, అమెరికా, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల్లో ఉంటున్న వీరిని.. భారత్‌ ఇప్పటికే ఉగ్రవాదులుగా (Khalistani terrorists) ప్రకటించింది. విదేశీ గడ్డపై ఉంటూ భారత్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న వీరి హవాలా కార్యకలాపాలు, స్థానికంగా ఆస్తులపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద వీరందరిపై చర్యలకు సిద్ధమైన ఎన్‌ఐఏ.. దాదాపు 20 మంది ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

అటువంటి వారు కెనడాను వీడండి.. వేర్పాటువాది బెదిరింపు

ఇలా ఖలిస్థాన్‌ వేర్పాటువాదంతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 43 మంది మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాను ఎన్‌ఐఏ ఇటీవలే విడుదల చేసింది. వీరికి సంబంధించిన ఆస్తుల వివరాలు తెలియజేయాలని ప్రజలకు సూచించింది. వీరి ఫొటోలను కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో ఉన్న ఖలిస్థాని సానుభూతిపరులు ఎక్కువగా కెనడాలోనే నివసిస్తున్నట్లు ఎన్‌ఐఏ అంచనా వేస్తోంది.

ఇదిలాఉంటే, కెనడాలోని భారతీయులను ఇటీవల బెదిరించిన నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. అమృత్‌సర్‌ శివారులోని పన్నూ పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో అతనికి ఉన్న 5.7 ఎకరాల భూమిని, చండీగఢ్‌లోని నివాసాన్ని స్వాధీనం చేసుకుంది. కెనడాలో నివసిస్తున్న పన్నూపై పంజాబ్‌, ఇతరప్రాంతాల్లో 12 కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు