Modi: త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

 ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi). ఈ సందర్భంగా జాతినుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

Updated : 15 Aug 2023 10:24 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఎర్రకోట సాక్షిగా దేశ ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా నూతన పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. రూ.లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ స్కీమ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.

విశ్వకర్మ యోజన..

విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు వీలుగా విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఈ పథకం ప్రారంభించనున్నామని, ఇందుకోసం తొలి విడతగా రూ.13వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

జన ఔషధి కేంద్రాల పెంపు

చౌక ధరల్లో లభించే జనరిక్‌ మందులు అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. మార్కెట్‌లో రూ.100కు దొరికే మందులు.. జన ఔషధి కేంద్రాల్లో రూ.10-15కే లభిస్తున్నట్లు తెలిపారు.

మీ ఆశీర్వాదం ఉంటే మళ్లీ వస్తా..

‘‘నేను మీ మధ్య నుంచే వచ్చినవాణ్ని. మీ గురించే ఆలోచిస్తా. మీరంతా నా కుటుంబం. నేను మీ కుటుంబంలో ఒకడిని. మా పనితీరు చూసి 2019లో మీరు నన్ను మళ్లీ ఎన్నుకున్నారు. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకం. 2047లో మనం 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను చేసుకోబోతున్నాం. మీరు మళ్లీ నన్ను ఆశీర్వదిస్తే.. వచ్చే ఏడాది ఆగస్టు 15న మళ్లీ వస్తా. ఎర్రకోట నుంచి మన దేశ విజయాలను చాటిచెప్తా’’ అంటూ 2024 ఎన్నికల్లో విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

మోదీ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కృతం కావాలి. యావజ్జాతి సంపూర్ణ సంకల్పంతోనే ఇది సాధ్యమవుతుంది.
  • అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. కుటుంబం చేత, కుటుంబం కోసం, కుటుంబానికి మేలు అన్నట్లుగా తయారయ్యాయి. గతంలో ఇవి దేశానికి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. దాన్ని సమూలంగా తుదముట్టించాలి. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి.
  • వరుస పేలుళ్ల శకం ముగిసింది. ప్రస్తుతం మన దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలంతా మరింత భద్రమైన పరిస్థితుల్లో జీవిస్తున్నామని ధైర్యంగా ఉన్నారు.
  • ప్రస్తుతం మనం ప్రపంచంలోనే ఐదో ఆర్థికశక్తిగా ఉన్నాం. అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నేను గ్యారెంటీ ఇస్తున్నా.
  • ఈసారి దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రకృతి విపత్తులు ఊహించని స్థాయిలో సంక్షోభాన్ని సృష్టించాయి. భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ విపత్తుల కారణంగా నష్టపోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
  • ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. గత ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది.
  • భారత ఇప్పుడు విశ్వ మిత్రగా మారింది. ప్రపంచ సంక్షేమానికి భారత్‌ బలమైన పునాదులు వేస్తోంది.
  • గత కొన్ని వారాలుగా మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన తల్లులు, సోదరిమణులు అకృత్యాలను చవిచూశారు. ఇది అత్యంత బాధాకరం. ఆ రాష్ట్రంలో క్రమంగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో మణిపుర్‌ ప్రజలకు యావత్ భారతావని అండగా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని