
Uttarakhand: కళ్ల ముందే బ్రిడ్జి కూలిపోయింది!
డెహ్రడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోటెత్తిన వరదల కారణంగా రహదారులు కొట్టుకుపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా రాణి పోఖారి గ్రామం వద్ద డెహ్రడూన్-రిషికేష్ బ్రిడ్జి కూలిపోయింది. దీనిపై ప్రయాణిస్తున్న ట్రక్ ఒకటి నీటిలో పడిపోయింది. మరికొన్ని వాహనాలు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని రిషికేష్- దేవప్రయాగ, రిషికేష్-తెహ్రీ, డెహ్రడూన్-ముస్సోరీ రహదారులను మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. సాధారణ వాతావరణ పరిస్థితులు వచ్చే వరకూ ఆ మార్గంలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. తపోవన్ నుంచి మలేత వెళ్లే జాతీయ రహదారి 58ను కూడా పూర్తిగా మూసివేశారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ సందర్భంగా హెచ్చరికలు సైతం జారీ చేసింది. నైనిటాల్, ఉద్ధమ్‌సింగ్ నగర్, బాగేశ్వర్, పితోరాఘర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.