Drivers Protest: ఏమిటీ ‘హిట్‌-అండ్‌-రన్‌’ నిబంధన? డ్రైవర్లలో ఎందుకింత ఆందోళన?

భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనను వ్యతిరేకిస్తోన్న ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్త ఆందోళనలకు దిగారు.

Updated : 02 Jan 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యాయ శిక్షాస్మృతుల్లో (Criminal laws) గణనీయమైన మార్పులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధన ట్రక్కు డ్రైవర్ల (Truck drivers strike) ఆగ్రహానికి కారణమయ్యింది. త్వరలో అమల్లోకి రానున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు రోజులపాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌లు, పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీఛార్జీలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లను ఆందోళనకు గురిచేస్తోన్న ఈ ‘హిట్‌-అండ్‌-రన్‌’ నిబంధనను ఓసారి పరిశీలిస్తే..

చట్టం ఏం చెబుతోంది..?

భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) ప్రకారం.. హిట్‌ అండ్‌ రన్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్‌ 104లో రెండు నిబంధనలు (Clauses) ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని మొదటి నిబంధనలో పేర్కొన్నారు. రెండో నిబంధనలో.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారతీయ శిక్షాస్మృతి (IPC)లో ఇవి సెక్షన్‌ 304ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐపీసీలో గరిష్ఠంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది.

డ్రైవర్లు ఏమంటున్నారు..?

‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాపైనే ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష పడితే పదేళ్లపాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ స్థాయిలో (రూ.7లక్షల) జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండు చేస్తున్నాయి.

ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు

ఆందోళన ఉద్ధృతం..

‘హిట్‌ అండ్‌ రన్‌’ నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణాలు రాస్తారోకోలు, భారీ ర్యాలీలతో అట్టుడుకుతున్నాయి. పెద్దసంఖ్యలో ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇంధన ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలా దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న డ్రైవర్ల ఆందోళనల కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ బంకులు ఖాళీ అవుతాయనే ఆందోళన నెలకొంది. ఈ ప్రభావం రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణా, పాఠశాలలపైనా పడనున్నట్లు కనిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని