Goldman Environmental Prize: అలోక్‌ శుక్లాకు ప్రతిష్ఠాత్మక గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రైజ్‌

‘ఛత్తీస్‌గఢ్‌ బచావో ఆందోళన్‌ సమితి’ కన్వీనర్‌ అలోక్‌ శుక్లా ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రైజ్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్లా గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. 

Published : 30 Apr 2024 10:12 IST

దిల్లీ: ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రైజ్‌’ (Goldman Environmental Prize)ను ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)కు చెందిన అటవీ, గిరిజన హక్కుల ఉద్యమకర్త అలోక్‌ శుక్లా (Alok Shukla)కు ప్రకటించారు. గ్రీన్‌ నోబెల్‌ (Green Nobel)గా పరిగణించే ఈ అవార్డును ప్రపంచంలోని ఆరు జనావాస ఖండాల పరిధిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ప్రకటిస్తారు. ‘ఛత్తీస్‌గఢ్‌ బచావో ఆందోళన్‌ సమితి’ కన్వీనర్‌ అయిన శుక్లా కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. ‘హస్దియో’ అడవుల్లోని 21 ప్రతిపాదిత బొగ్గు గనుల ప్రాంతంలోని అత్యంత జీవవైవిధ్యం ఉన్న 4.45 లక్షల ఎకరాలను తన ఉద్యమంతో కాపాడారు. ఆయన కృషిని గుర్తిస్తూ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేస్తున్న శుక్లాకు  ‘గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫౌండేషన్‌’ అవార్డును ప్రకటించింది. 

‘‘హస్దియో అరణ్యాల్లో ప్రతిపాదించిన 21 బొగ్గు గనుల వేలాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అత్యంత సహజంగా ఏర్పడ్డ ఈ అరణ్యాలు ఛత్తీస్‌గఢ్‌ ఊపిరితిత్తులుగా ప్రసిద్ధి చెందాయి. భారత్‌లోని చెక్కుచెదరని అటవీ ప్రాంతాల్లో ఇవి ఒకటి’’ అని గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. తనకు ఈ అవార్డు ప్రకటించడం పట్ల అలోక్‌ శుక్లా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘హస్దియో అడవుల సంరక్షణ కోసం కొన్నేళ్లుగా పోరాడుతున్న ఆదివాసి ప్రజలకు ఈ గుర్తింపు దక్కుతుంది. హస్దియో అడవుల సంరక్షణను బలోపేతం చేయడంలో ఈ అవార్డు ఎంతగానో సహాయపడుతుంది. మన అడవులు, నీరు, పర్యావరణ వ్యవస్థను సంరక్షించటం ద్వారా వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిల పోరాటాలకు ‘హస్దియో’ ఉద్యమం ఒక ఆశాదీపంగా నిలుస్తుంది’’ అని 43 ఏళ్ల శుక్లా అన్నారు.  

ఛత్తీస్‌గఢ్‌లో 657 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న హస్దియో అడవులు అనేక జీవజాతులకు ఆశ్రయంగా నిలుస్తున్నాయి. వీటిల్లో 25 అంతరించిపోతున్న జాతులు, 92 రకాల పక్షుల జాతులు, 167 ఔషధ వృక్ష జాతులు ఉన్నాయి. 15 వేల మంది గిరిజనులు వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం భారత్‌లోనే అతిపెద్ద బొగ్గు నిల్వల కేంద్రంగా ఉన్నట్లు తేలింది. దాదాపు ఐదు బిలియన్ల టన్నుల బొగ్గు ఈ అడవుల కింద ఉన్నట్లు అంచనా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని