నాలుగేళ్ల కుమారుడి సాక్ష్యం.. హత్యకేసులో తండ్రికి జీవితఖైదు

కళ్లముందే తన తల్లిని తండ్రి చంపేస్తున్నా అడ్డుకోలేని వయసు ఆ చిన్నారిది. కానీ, ఆ బాలుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగానే అతడి తండ్రికి జీవితఖైదు పడింది.

Updated : 25 Jul 2023 17:30 IST

ముంబయి: తన భార్యను అతి దారుణంగా చంపిన ఓ భర్తకు మహారాష్ట్రలోని ముంబయి (Mumbai) సెషన్స్‌ కోర్టు జీవితఖైదు (life sentence) విధించింది. తల్లి హత్యను కళ్లారా చూసిన నాలుగేళ్ల కుమారుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగా కోర్టు ఆ తండ్రికి శిక్ష వేసింది. వివరాల్లోకి వెళితే..

ముంబయిలోని దాదర్‌ ప్రాంతానికి చెందిన ఉమేశ్‌ బొబలే ఓ డెంటిస్ట్‌. ఇతడికి 2009లో తనూజ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తనూజ తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత భర్తకు దూరంగా తన పుట్టింటివారితో కలిసి నివసించేది.

ఈ క్రమంలోనే భార్యపై కోపం పెంచుకున్న ఉమేశ్.. 2016 డిసెంబరు 11న ఆమె ఉంటున్న ఇంటికి వచ్చి అతి కిరాతకంగా హత్యచేశాడు. 37 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తనే పోలీసులకు ఫోన్‌ చేసి లొంగిపోయాడు. ఘటన జరిగిన సమయంలో ఉమేశ్ కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అప్పటికి ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు.

20 ఏళ్లలో తొలిసారి.. మహిళను ఉరితీయనున్న సింగపూర్‌

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. అయితే, తన మానసిక పరిస్థితి సరిగా లేదని.. ఆ క్షణంలో ఏం చేస్తున్నానో కూడా తనకు తెలియలేదని నిందితుడు ఉమేశ్ న్యాయస్థానానికి తెలిపాడు. ఈ క్రమంలోనే ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సెషన్స్‌ కోర్టు.. 10 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో మృతురాలి కుమారుడితో పాటు ఆమె సోదరుడు, నిందితుడి బంధువు తదితరులున్నారు.

కేసు విచారణ సందర్భంగా 2020లో మృతురాలి కుమారుడిని కోర్టులో హాజరుపర్చగా ఆ చిన్నారి సాక్ష్యం చెప్పాడు. ‘‘ఆ రోజు రాత్రి నాన్న మా ఇంటికి వచ్చి అమ్మను కొట్టాడు. కత్తితో పొడిచి చంపాడు. నేను అరవలేదు కానీ, నా గుండెల్లో ఏదో దడగా అనిపించింది’’ అని ఆ బాలుడు కోర్టుకు వివరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. కుమారుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఉమేశ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని