రైల్వేస్టేషన్లోనూ ఎయిర్‌పోర్టు తరహా స్క్రీనింగ్!

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో రానున్న రోజుల్లో ప్రజారవాణాలో స్క్రీనింగ్‌ వ్యవస్థ పటిష్టం కాబోతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల్లో భాగంగా విమానాశ్రయాల్లో తనిఖీ వ్యవస్థ పూర్తిస్థాయిలో మారనుంది.

Published : 12 May 2020 20:50 IST

తిరువనంతపురం: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో రానున్న రోజుల్లో ప్రజారవాణాలో స్క్రీనింగ్‌ వ్యవస్థ పటిష్టం కాబోతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల్లో భాగంగా విమానాశ్రయాల్లో తనిఖీ వ్యవస్థ పూర్తిస్థాయిలో మారనుంది. దీనికోసం ఎయిర్‌పోర్టుల్లో పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. తాజాగా విదేశాలనుంచి భారత్‌కు ప్రత్యేక విమానాల్లో వచ్చిన ప్రయాణికులు ఫేస్‌షీల్డ్‌ పెట్టుకోవడాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించిన విషయం తెలిసిందే. మున్ముందు కూడా విమానాశ్రయంలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కొన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.

ఇక మనదేశంలో సుదీర్ఘ సమయం తరువాత ఈ రోజునుంచి కొన్ని రైలు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వేలసంఖ్యలో ప్రజలు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో కేరళ ప్రభుత్వం రైల్వే స్టేషన్లలోనే విమానాశ్రయం తరహాలో స్క్రీనింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ తరహాలోనే ఇక్కడ కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర మంత్రి సునిల్‌ కుమార్‌ వెల్లడించారు. రైలు దిగిన వెంటనే ప్రయాణికులకు స్క్రీనింగ్ చేయడంతో పాటు లక్షణాలను పరీక్షిస్తారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే రైల్వేస్టేషన్‌ నుంచే వారిని ఆసుపత్రికి తరలిస్తారు. లక్షణాలు లేనివారిని మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వారి సొంత జిల్లాలకు తరలిస్తారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక రైళ్లు ఆగే కోలికొడ్‌, ఎర్నాకులం, తిరువనంతపురంలలో ఈ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 519 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా నలుగురు మరణించారు.

తాజా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రైలు ప్రయాణం చేసే ప్రతిఒక్కరికీ స్క్రీనింగ్‌ చేస్తారు. కేవలం లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. లోనికి వెళ్లే మార్గంతో పాటు బయటకు వచ్చే మార్గంలో శానిటైజర్లను ఏర్పాటు చేస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని