కరోనా:భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయం

కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో భారత్‌లోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రపంచ బ్యాంకు సుమారు రూ.7500 కోట్ల భారీ సహాయాన్ని ప్రకటించింది.

Updated : 15 May 2020 16:07 IST

పేదలు, వలస కార్మికుల సంక్షేమం కోసం నిధుల విడుదల

దిల్లీ: కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో భారత్‌లోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రపంచ బ్యాంకు ఒక బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.7500 కోట్ల భారీ సహాయాన్ని ప్రకటించింది. కరోనా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మనిర్భర్‌ మిషన్‌’ పథకానికి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు లభించాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా ఏకీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని బ్యాంకు సూచించింది. కరోనా అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత్‌కు గతంలో అందించిన ఒక బిలియన్‌ డాలర్ల సహాయానికి అదనంగా  ప్రస్తుత ప్యాకేజ్‌ను అందిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ప్రపంచ బ్యాంకు డైరక్టర్‌ (భారత్‌) జునైద్‌ అహ్మద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఆత్మనిర్భర్‌ మిషన్ పథకం విధాన పరంగా చాలా ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు సామాజిక భద్రతను, సమతుల్యతను అందించటంలో ఈ పథకం ముఖ్యపాత్ర పోషిస్తుంది.’’ అని తెలిపారు. కొవిడ్‌-19 ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో... భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికీ, జీవనోపాధికీ సమాన ప్రాముఖ్యతనిస్తోందని ఆయన ప్రశంసించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని