ప్రపంచ వాణిజ్యంలో ప్రతిష్టంభన

ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో చిక్కుకొని గత ఆరు రోజులుగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నౌక ‘ఎవర్‌ గివన్‌’ను కదిలించే

Published : 29 Mar 2021 07:46 IST

సూయిజ్‌ కాలువలో ఓడల బారులు 
కొనసాగుతున్న తొలగింపు చర్యలు

 సిరియాపై తీవ్ర ప్రభావం: ఐరాస

సూయిజ్‌: ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో చిక్కుకొని గత ఆరు రోజులుగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నౌక ‘ఎవర్‌ గివన్‌’ను కదిలించే చర్యలు ఆదివారం ముమ్మరంగా కొనసాగాయి. అదనంగా మరో రెండు టగ్‌బోట్లు తెప్పించి ఓడను కదిలించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆసియా, యూరప్‌ల మధ్య సరకులు రవాణా చేసే ఈ భారీనౌక వాణిజ్య ప్రధాన జలమార్గంలో గత మంగళవారం నుంచి అడ్డంగా తిరిగి చిక్కుకొంది. ఈ మార్గంలో వెళ్లాల్సిన నౌకల రద్దీ రాను రాను పెరుగుతుండటం వల్ల కొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో కుదుపునకు గురైన ప్రపంచ నౌకా రవాణారంగం ఇప్పుడు ఈ తాజా సమస్యతో మరో సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజుకు రూ.65,205 కోట్ల (9 బిలియన్‌ డాలర్లు) వ్యాపారం స్తంభిస్తోంది. ‘ఎవర్‌ గివన్‌’ను కదిలించే పనుల్లో నిమగ్నమై ఉన్న టగ్‌బోట్లకు సహకరించేందుకు డచ్, ఇటాలియన్‌ బోట్లు ఆదివారం తెల్లవారుజామున ఎర్రసముద్రం చేరుకున్నాయి. 400 మీటర్ల పొడవు ఉన్న ఓడ అడుగు భాగాన డ్రెడ్జర్లు ఇసుక, బంకమట్టి తవ్వేకొద్దీ టగ్‌బోట్లు భారీనౌకను కదిలించే ప్రయత్నం చేస్తున్నట్టు షిప్‌ యాజమాన్య ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. ఓడలో సరకును తరలించి తేలికపరిచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. 
వేలాది ఓడలకు ఇదే మార్గం: అధికారిక గణాంకాల ప్రకారం.. సూయిజ్‌ జలమార్గం ద్వారా గతేడాది 19 వేల ఓడలు ప్రయాణించాయి. ప్రపంచ వాణిజ్యంలో పది శాతం ఈ కాలువ మీదుగానే జరుగుతుంది. ప్రమాద సమయానికి ‘ఎవర్‌ గివన్‌’లో 20 వేల కంటైనర్లు ఉన్నాయి. పరిస్థితిని ఆరా తీసిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతేహ్‌ అల్‌ సిసి సమస్య పరిష్కారానికి అన్ని అవకాశాలు ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ఓడ నుంచి కంటైనర్లు తరలించాలని కెనాల్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయానికి సూయిజ్‌ కాలువ మీదుగా వెళ్లేందుకు 321 నౌకలు వేచి చూస్తున్నాయి.  
సిరియాలో మళ్లీ సంక్షోభం: గత ఆరు రోజులుగా జలరవాణా స్తంభించడంతో అసలే యుద్ధంతో దెబ్బతిన్న దేశమైన సిరియాలో అప్పుడే ఇంధన సరఫరాకు రేషను విధానం ప్రవేశపెట్టారు. కనీస అవసరాలు, మందుల కోసం కటకటలాడుతున్న సిరియా పౌరులు ప్రభుత్వ రాయితీతో ఇచ్చే ఆహారం, ఇంధనం కోసం వరుసలు కడుతున్నారు. 80 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్న ఈ దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని