Updated : 22 Nov 2021 11:37 IST

Ban Ki-moon: నా హృదయంలో సగభాగమంతా.. భారత్‌

ఆత్మకథలో వెల్లడించిన ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌

దిల్లీ: తన హృదయంలో సగం భారతీయులకే చెందుతుందని ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ తాజాగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘రిజాల్వ్‌డ్‌: యునైటింగ్‌ నేషన్స్‌ ఇన్‌ ఏ డివైడెడ్‌ వరల్డ్‌’లో వెల్లడించారు. ‘‘నా తొలి పోస్టింగ్‌ భారత్‌లో. నేను, సూన్‌టేక్‌ (మూన్‌ భార్య) అక్టోబరు 1972లో దిల్లీ వచ్చాం. అక్కడ దాదాపు మూడేళ్లు పనిచేశాను. తొలుత కొరియన్‌ కాన్సులేట్‌ జనరల్‌లో వైస్‌ కాన్సుల్‌గా పనిచేశాను. డిసెంబరు 1973లో భారత్‌-కొరియాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు మొదలయ్యాక.. కొరియా రాయబార కార్యాలయంలో సెకండ్‌ సెక్రటరీగా పనిచేశాను. భారత్‌తో నా ఆస్తిఅప్పుల పట్టిక సమగ్రంగా ఉందని నేను భారతీయులతో జోక్‌ చేస్తుంటాను. ఎందుకంటే.. నా కుమారుడు భారత్‌లో జన్మించాడు. నా చిన్న కుమార్తె హ్యూన్‌హీ భారతీయుడిని వివాహం చేసుకుంది. 50 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. నా హృదయంలో సగం భారత్‌కు చెందుతుందని నేను భారతీయులకు చెబుతాను’’ అని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని హార్పర్‌ కొలిన్స్‌ ఇండియా సంస్థ ప్రచురించింది.

రుణం తీర్చుకోవాలని..

ఐరాస ఆవిర్భావానికి ఏడాది ముందు 1944లో కొరియాలోని ఓ గ్రామంలో జన్మించిన బాన్‌కు.. తన గ్రామంపై జారవిడిచిన బాంబులు చేసిన శబ్దాలు, మిగిలి ఉన్న వస్తువులను దహించి వేస్తున్న అగ్నికీలలు వంటి చిన్ననాటి జ్ఞాపకాలే ఎక్కువ. ఆరేళ్ల వయసులో కుటుంబంతో సహా వలస వెళ్లిపోవడం, బురదతో తడిసిపోయిన బూట్లు ఈడ్చుకుంటూ కిలోమీటర్ల దూరం నడవడం, తీవ్రమైన ఆకలితో బాధ పడుతూ అసలు బతుకుతామా? అనుకుంటున్న తమను ఐరాస రక్షించడం వంటి అంశాలు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. తనను ఆదుకున్న ఐరాస రుణం తీర్చుకోవాలని యువకుడిగా ఉన్నప్పుడు మూన్‌ పదేపదే భావించేవారు. 

శశిథరూర్‌తో పోటీపై..

2006లో ఐరాస ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో శశిథరూర్‌తో పోటీ పడడాన్ని బాన్‌ తన ఆత్మకథలో ప్రస్తావించారు. ‘‘థాయిలాండ్‌ అభ్యర్థి సాథిరాథి మాత్రమే నాకు ప్రత్యర్థి అని భావించాను. శశిథరూర్, శ్రీలంక రాయబారి ధనపాలాలకు వారి ప్రభుత్వాల నుంచి మద్దతు లేదు. తొలి తాత్కాలిక పోలింగ్‌ ఫలితాలు నా అంచనాలను మించిపోయాయి. శశిథరూర్‌కు భారత ప్రభుత్వం నుంచి మద్దతు లేదని చెబుతున్నప్పటికీ ఆయనకు తాత్కాలిక పోలింగ్‌లో పది ఓట్లు రావడం నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. అనంతరం మూడో దఫా పోలింగ్‌లో.. నాకు 13 ‘ప్రోత్సాహక’ ఓట్లు వచ్చాయి. డిస్కరేజ్, అభిప్రాయం చెప్పలేం అన్న ఓట్లు ఒక్కోటి చొప్పున లభించాయి. అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఏదేమైనా 13 ఓట్లు లభించడంతో గెలుపునకు అవసరమైన కనీస ఓట్ల సంఖ్య 9 దాటింది నేను మాత్రమే. శశిథరూర్‌కు కేవలం ఎనిమిదే వచ్చాయి’’ అని తెలిపారు. అనంతరం బాన్‌ కీ మూన్‌ ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికయ్యారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని