వరద నీటిలోనే ఎర్రకోట, మహాత్ముని సమాధి

దేశ రాజధాని దిల్లీ నగరంలో పలు ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే చిక్కుకుని ఉన్నాయి. దీంతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.

Updated : 17 Jul 2023 05:39 IST

ప్రమాదకర స్థాయి వద్దే   యమునా నీటి మట్టం
త్వరలో సాధారణ పరిస్థితులు
సీఎం కేజ్రీవాల్‌ ఆశాభావం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగరంలో పలు ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే చిక్కుకుని ఉన్నాయి. దీంతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లను మించే ఉంది. ఆదివారం ఉదయానికి అది 205.98 మీటర్లుగా నమోదైంది. కొత్తగా వర్షాలు లేకపోతే ఆదివారం రాత్రికి ఇది 205.75 మీటర్లకు తగ్గవచ్చని భావిస్తున్నారు.

దిల్లీలోని ఎర్రకోట పరిసరాలు, మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వరద నీటిలోనే ఉన్నాయి. కశ్మీర్‌ గేట్‌ వద్ద మోకాల్లోతు ఉన్న నీటిలో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. మయూర్‌ విహార్‌, ఓల్డ్‌ యమునా బ్రిడ్జ్‌ ప్రాంతాల్లో అనేక మంది బహిరంగ ప్రదేశాల్లోనే టార్పాలిన్‌ కవర్లు కప్పుకుని నిద్రపోతున్నారు. మరో దారిలేక ఆరుబయటే మలవిసర్జనకు పాల్పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని బాధిత ప్రజల కోసం వసతి, ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు సహా ప్రత్యేక సహాయ పునరావాస చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు. మోరి గేట్‌లోని సహాయక శిబిరాన్ని సందర్శించి అక్కడి వారికి ధైర్యం చెప్పారు.

ఒక్కో కుటుంబానికి రూ.10వేలు సాయం

వరద బాధిత కుటుంబాలన్నింటికీ రూ.10వేలు చొప్పున కేజ్రీవాల్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. బట్టలు, పుస్తకాలు కొట్టుకుపోయిన పిల్లలకు పాఠశాలలే వాటిని సమకూరుస్తాయని ట్విటర్‌లో తెలిపారు. ఆధార్‌కార్డ్‌ సహా ఇతర విలువైన పత్రాలు పోగొట్టుకున్నవారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యుమునా బ్యారేజీలో మొరాయిస్తున్న ఐదు గేట్లను తెరిచేందుకు యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో స్థానికులు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. గృహాల్లో, చుట్టుపక్కలా పేరుకుపోయిన బురదను తొలగించుకునే ప్రయత్నాల్లో పడ్డారు.

18 వరకూ పాఠశాలలకు సెలవులు

యమునా నది సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 17, 18 తేదీల వరకూ సెలవులు పొడిగిస్తున్నట్టు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మంది మృతి

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 10 మంది వరదల కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. నొయిడాలోని దనాకౌర్‌ ప్రాంతంలో ఇద్దరు యువకులు యమునా ప్రవాహంలో కొట్టుకుపోయారు. యూపీలోని గౌతమ్‌ బుద్ధానగర్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యుమునా ప్రవాహాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల కారణంగా రూ.8 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.

అస్సాంలో బిశ్వనాథ్‌ సబ్‌డివిజన్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. దాదాపు 32,400 మందిపై దీని ప్రభావం పడింది. 47 గ్రామాలు నీట మునగగా.. 858 హెక్టార్ల మేర పంట దెబ్బతింది.

ఉత్తరాఖండ్‌లో చమోలీ జిల్లాలో బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్‌హెచ్‌-109 దాదాపు ఏడు చోట్ల మూతపడిందని అధికారులు పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని మొత్తం 33 జిల్లాలకుగాను.. 15 జిల్లాల్లో ఈసారి అసాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క జిల్లాలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.

తాజాగా దాదాపు 6,600 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు జమ్మూ నగరం నుంచి హిమలింగ దర్శనానికి బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు