సీసం కాడ్మియం ఆర్సెనిక్‌తో గుండెకు చిచ్చు

క్యాన్సర్‌ కారకాలుగా ముద్రపడిన సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌లు గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వల్పస్థాయిలో దీర్ఘకాలం పాటు ఈ రసాయనాల తాకిడికి గురైనా.. గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వారు పేర్కొన్నారు.

Published : 25 Jul 2023 05:18 IST

క్యాన్సర్‌ కారకాలుగా ముద్రపడిన సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌లు గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వల్పస్థాయిలో దీర్ఘకాలం పాటు ఈ రసాయనాల తాకిడికి గురైనా.. గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వారు పేర్కొన్నారు. నానాటికీ పెరుగుతున్న హృద్రోగాల కట్టడికి మిగతా అంశాలతోపాటు ఈ విషతుల్య పదార్థాల నియంత్రణపైనా దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

పారిశ్రామిక కార్యకలాపాలు భారీగా పెరగడం వల్ల హానికర భార లోహాల తాకిడి మానవులపై బాగా పెరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌లు. గుండె జబ్బు కారకాలుగా విస్తృతంగా ప్రచారమవుతున్న అంశాల్లో ఈ మూడు రసాయనాలు లేవు. అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించిన అధ్యయనాలు ఇవి గుండెకు చేటు చేస్తాయని చెబుతున్నాయి. 

ఏ జబ్బులు రావొచ్చు..?

సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌ల తాకిడికి తక్కువ లేదా ఒక మోస్తరు స్థాయిలో గురైనా.. గుండె పోటు, గుండె జబ్బు, పక్షవాతం; కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలకు వచ్చే రుగ్మతల (పెరీఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌) ముప్పు పెరుగుతుంది. 12 దేశాల్లో 3.5 లక్షలమందిపై పరిశీలన జరిపిన 37 అధ్యయనాలను 2018లో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మూత్రంలో ఆర్సెనిక్‌, రక్తంలో సీసం, కాడ్మియం మోతాదు ఎక్కువగా ఉంటే పక్షవాతం, గుండె జబ్బు ముప్పు 15 నుంచి 85 శాతం మేర పెరుగుతుందని వెల్లడైంది.

దశాబ్దాల పాటు తిష్ఠ

ఈ మూడు లోహాలు శ్వాస, జీర్ణాశయ వ్యవస్థల ద్వారా ఒంట్లోకి ప్రవేశిస్తాయి. దశాబ్దాల పాటు ఎముకలు, అవయవాల్లో తిష్ఠవేస్తాయి. ఈ లోహాలు శరీరంలోని కీలక జీవక్రియల్లో జోక్యం చేసుకుంటాయి. సీసానికి గురికావడం వల్ల ఒక్క అమెరికాలోనే ఏటా 4.5 లక్షల మందికిపైగా చనిపోతున్నారని ఓ అధ్యయనం పేర్కొంది.

ఎవరిపై ఎక్కువ?

ప్రధాన రహదారులు, పరిశ్రమలు, ప్రమాదకర వ్యర్థాలు ఉండే ప్రదేశాలకు చేరువగా నివసించేవారికి, పర్యావరణ నిబంధనలు సరిగా అమలు కాని ప్రాంతాల్లోని ప్రజలకు ఈ రసాయనాలతో ఇబ్బందులు మరీ ఎక్కువ. అల్పాదాయ వర్గాలు నివసించే ప్రాంతాలపై వీటి తాకిడి అధికంగా కనిపిస్తోంది.

ఏం చేయాలి?

* పర్యావరణంలో ఇలాంటి హానికర లోహాల స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.
* ధూమపానాన్ని తగ్గించుకోవాలి. తాగునీటి వ్యవస్థలను సంరక్షించాలి. గాలి, ఆహారం, నేలలో హానికర లోహాల కాలుష్యానికి కళ్లెం వేయాలి.  
* రక్తప్రసరణ వ్యవస్థపై ఇలాంటి హానికర లోహాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రామాణిక మందులు లేవు. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. హానికర పదార్థాలను తొలగించే ‘చెలాటింగ్‌ ఏజెంట్ల’ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. శరీరం నుంచి సీసం, కాడ్మియాన్ని తొలగించడానికి ఇవి ఉపయోగపడొచ్చు. ఈ లోహాల ప్రభావాన్ని తగ్గించే పోషక సప్లిమెంట్లపైనా పరిశోధన జరగాలి.


మూలాలు ఎక్కడ?

రోజువారీ జీవనంలో మనకు తెలియకుండానే సాధారణ గృహోపకరణాలు, గాలి, నీరు, నేల, ఆహారం ద్వారా ఈ విషతుల్య రసాయనాల తాకిడికి గురవుతుంటాం.

సీసం: ఇళ్లకు వేసే రంగులు, పొగాకు ఉత్పత్తులు, పక్కవారు వదిలే సిగరెట్‌ పొగకు గురికావడం, భూగర్భ జలాలు, కలుషిత ఆహారం (కొన్నిరకాల మట్టి వస్తువులు, సిరామిక్స్‌, వంటపాత్రల్లో సీసం ఉంటుంది. వాటివల్ల ఆహారంలోకి ఆ రసాయనం చేరుతుంది.) నీటి పైపులు, సౌందర్య లేపనాలు, ఎలక్ట్రానిక్స్‌, పారిశ్రామిక ఉద్గారాలు ఈ కాలుష్య కారకం నివాసాలు. సిగరెట్‌ పొగలో సీసం, క్యాడ్మియం రెండూ ఉంటాయి.

కాడ్మియం: నికెల్‌-కాడ్మియం బ్యాటరీలు, పిగ్మెంట్లు, ప్లాస్టిక్‌, పింగాణీ, గ్లాస్‌వేర్‌, నిర్మాణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్లో ఈ రసాయనం ఉంటుంది. అలాగే పరిశ్రమల్లో ఎరువుల ఉత్పత్తికి ఫాస్ఫేట్‌ రాక్‌ను ఉపయోగిస్తారు. అందులో కాడ్మియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దుంప జాతి కూరగాయలు, ఆకు కూరలు, పొగాకు ఈ రసాయనంతో కలుషితమవుతాయి.

ఆర్సెనిక్‌: ప్రధానంగా భూగర్భజలాల ద్వారా ఈ రసాయనం శరీరంలోకి చేరుతుంది. దీనివల్ల తాగునీరు, కలుషిత నేలలో పండే ఆహారంపై ప్రభావం పడుతుంది. ఇతర ఆహార పంటలతో పోలిస్తే వరిలో ఇది ఎక్కువగా పేరుకుపోతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈనాడు, ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని