వ్యాక్సిన్‌ అదనపు డోస్‌ అవసరం లేదు

దేశంలో వెలుగు చూసిన కొవిడ్‌ కొత్త ఉపరకం జేఎన్‌.1 కోసం అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌) అధిపతి డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు.

Published : 25 Dec 2023 03:54 IST

జేఎన్‌.1పై ‘ఇన్సాకాగ్‌’

దిల్లీ: దేశంలో వెలుగు చూసిన కొవిడ్‌ కొత్త ఉపరకం జేఎన్‌.1 కోసం అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌) అధిపతి డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. అయితే, ఈ ఉపరకం వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘60 ఏళ్లు ఆపై వయసు వారితోపాటు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ఉపరకంతో అప్రమత్తంగా ఉండాలి. దీనికి అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ అవసరంలేదు. ప్రతి వారం దేశంలో కొత్త ఉపరకం వస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా ఉపరకాలను గుర్తించాం. ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్‌ రకం వల్ల కలిగే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతోపాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నుంచి రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చు’’అని అరోరా తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 656 కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు.


ప్రమాదం తక్కువే కానీ..

డబ్ల్యూహెచ్‌వో

జేఎన్‌.1తో ప్రమాదం తక్కువేనని, అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచదేశాలు ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ‘‘కొవిడ్‌-19 వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిణామం చెందుతూ.. మార్పు చెందుతూ.. వ్యాప్తి చెందుతూ ఉంది. జేఎన్‌.1తో ప్రజారోగ్య ప్రమాదం తక్కువగా ఉందని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నప్పటికీ..ఈ వైరస్‌ల పరిణామక్రమాన్ని పరిశీలిస్తూ.. అందుకు తగ్గట్టు ప్రతిస్పందనను మనం రూపొందించుకోవాలి. ఇందుకోసం అన్ని దేశాలు నిఘా, జన్యుక్రమ విశ్లేషణను బలోపేతం చేసుకోవాలి’’ అని డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు