ఆపత్కాలంలో ఆప్‌!

అవినీతిపై పోరాటంలో నుంచే ఆ పార్టీ పుట్టింది. ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ఎంతో కాలం పోరాటం చేసింది.

Updated : 23 Mar 2024 06:07 IST

అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్‌
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని నడిపించేదెవరు?

దిల్లీ: అవినీతిపై పోరాటంలో నుంచే ఆ పార్టీ పుట్టింది. ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ఎంతో కాలం పోరాటం చేసింది. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకూ అవినీతిని అంతమొందించాలనేదే ఆ పార్టీ మూల సూత్రం. అవినీతిపై ఆ పార్టీ చేసిన పోరాటం ద్వారానే గుర్తింపు వచ్చింది. దాని అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏకంగా దిల్లీ ముఖ్యమంత్రే అయ్యారు. మరో రాష్ట్రం పంజాబ్‌లో పార్టీ పాగా వేసింది. అలాంటి పార్టీ అదే అవినీతి ఊబిలో కూరుకుపోవడం అనూహ్యం.. ఆశ్చర్యకరం. రెండేళ్లలోనే ఆ పార్టీ కీలక నేతలు వరుసగా జైళ్లకు వెళ్లడం ఎంత చిత్రం.. అవినీతిపై పోరాటం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారి అతి తక్కువ కాలంలోనే జాతీయ హోదా సాధించుకున్న రాజకీయ పక్షం ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వేళ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధినేత కేజ్రీవాల్‌, సీనియర్‌ నేతలు మనీశ్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌లు జైల్లో ఉండటంతో పార్టీని నడిపించేదెవరన్న చర్చ మొదలైంది.

అంతా తానై..

కేజ్రీవాల్‌ తన విజన్‌కు అనుగుణంగానే ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చారు. దిల్లీ, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌లలో చెప్పుకోదగిన స్థాయిలో ఆప్‌ క్యాడర్‌ ఉందంటే దానికి కారణం కేజ్రీవాల్‌ విజనే. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తరుణంలోనూ ఆయనే ‘ఇండియా’ కూటమితో పొత్తు పెట్టుకుని కీలక పోరుకు సిద్ధమయ్యారు. అయితే 55ఏళ్ల కేజ్రీవాల్‌ అరెస్టుతో అంతా తలకిందులైంది. ఆయనకు విశ్వాసంగా ఉండే సిసోదియా, సంజయ్‌ సింగ్‌ జైల్లోనే ఉన్నారు. మరో విశ్వాసపాత్రుడు సత్యేందర్‌ జైన్‌ మరో కేసులో కారాగారంలోనే ఉన్నారు.

దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు

దాదాపు దశాబ్దకాల ఆప్‌ రాజకీయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా ప్రకటించుకున్న కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరారు. గతంలో భాజపా హిందుత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ఇటీవల హిందుత్వకు కొంత సానుకూలంగా మాట్లాడుతున్నారు. భక్తులను ఉచిత యాత్రల పథకంతోపాటు కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించాలనే స్థాయికి వచ్చారు.


అరెస్టైనా సీఎంగా కొనసాగొచ్చు

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ సీఎంగా కొనసాగవచ్చని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ రాజీనామా చేయలేదని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆప్‌ వర్గాలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంగా కేజ్రీవాల్‌ కొనసాగవచ్చా.. అన్న ప్రశ్నపై సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర నారాయణన్‌ శుక్రవారం మాట్లాడుతూ.. ‘సీఎంగా అరెస్టైన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడంపై చట్టంలో ఎలాంటి నిషేధం లేదు. సాంకేతికంగా జైలు నుంచి పరిపాలించడం సాధ్యమే’ అని పేర్కొన్నారు. మరో సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ మాట్లాడుతూ.. చట్టపరంగా ఎలాంటి నిషేధం లేకున్నా పరిపాలనా పరంగా కొనసాగడం అసాధ్యమేనని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని