Google: కొత్త చట్టాలు ‘మా ఇంజిన్‌’కు వర్తించవు

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనలు తమ సెర్చి ఇంజిన్‌కు వర్తించవని అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్‌ వాదించింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ దిల్లీ హైకోర్టును కోరింది. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్‌ నుంచి తొలగించే విషయమై దాఖలైన కేసులో.. దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి తమపై ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టాలంటూ కోర్టుకు గూగుల్‌ విజ్ఞప్తి చేసింది.

Updated : 03 Jun 2021 07:11 IST

దిల్లీ హైకోర్టులో గూగుల్‌ వాదన

దిల్లీ: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనలు తమ సెర్చి ఇంజిన్‌కు వర్తించవని అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్‌ వాదించింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ దిల్లీ హైకోర్టును కోరింది. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్‌ నుంచి తొలగించే విషయమై దాఖలైన కేసులో.. దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి తమపై ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టాలంటూ కోర్టుకు గూగుల్‌ విజ్ఞప్తి చేసింది.
కేసు నేపథ్యం ఇదీ...
ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను కొంతమంది అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టారు. వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయినా పూర్తిస్థాయిలో వాటిని ఇంటర్నెట్‌ నుంచి తొలగించలేదు. కొంతమంది ఆకతాయిలు వాటిని ఇతర గ్రూపులు, సైట్లకు రీపోస్టు చేశారు. ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఏప్రిల్‌ 20న ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా గూగుల్‌తో పాటు ఇతర సెర్చి ఇంజిన్లను కూడా సోషల్‌మీడియా మధ్యవర్తులుగా తన తీర్పులో పేర్కొన్నారు. తద్వారా కొత్త ఐటీ చట్టం నిబంధనలు వర్తిస్తాయని అర్థం. కోర్టు ఆదేశాలను పాటించకుంటే.. ఐటీ చట్టం కింద ఇన్నాళ్లూ పొందిన మధ్యవర్తి హోదాను గూగుల్‌ సెర్చి ఇంజిన్‌ కూడా కోల్పోతుంది. దీనిపైనే గూగుల్‌ బుధవారం దిల్లీ హైకోర్టులో అభ్యంతరం వ్యక్తంజేసింది. తమ సెర్చి ఇంజిన్‌ను సోషల్‌ మీడియా మధ్యవర్తిగా పరిగణించకూడదని వాదించింది. తమకు ఐటీ నిబంధనలు వర్తించవని.. తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును గూగుల్‌ కోరింది. సింగిల్‌ జడ్జి చట్టాలను తప్పుగా అన్వయించి తమను కొత్త ఐటీ చట్టాల పరిధిలోకి తీసుకొచ్చారని, ఆ ఆదేశాలను అమలు చేయకుండా నిలుపుదల చేయాలని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జులై 25లోగా గూగుల్‌ చేస్తున్న వాదనపై తమ స్పందన తెలపాలని కోరింది. ఇదే సమయంలో... గూగుల్‌ అడిగినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటానికి ధర్మాసనం నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని