భార్యకు తెలియకుండా మాటల రికార్డు ఆమె గోప్యతకు భంగమే

దొంగచాటుగా భార్య ఫోన్‌ సంభాషణలను రికార్డు చేయడం తప్పేనని పంజాబ్‌-హరియాణా హైకోర్టు తెలిపింది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతకు భంగం...

Published : 14 Dec 2021 06:43 IST

పంజాబ్‌- హరియాణా హైకోర్టు వ్యాఖ్య  

చండీగఢ్‌: దొంగచాటుగా భార్య ఫోన్‌ సంభాషణలను రికార్డు చేయడం తప్పేనని పంజాబ్‌-హరియాణా హైకోర్టు తెలిపింది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని పేర్కొంది. భార్యాభర్తల విడాకుల కేసు విషయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ ఈ వ్యాఖ్య చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే... తన భార్య సంభాషణలకు సంబంధించిన సీడీని సమర్పిస్తానని భర్త చెప్పగా భటిండాలోని కుటుంబ న్యాయస్థానం అంగీకరించింది. తన అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా పరిగణించకూడదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్‌ 65 ప్రకారం సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన మాటలను సాక్ష్యాలుగా పరిగణించకూడదని, కానీ కుటుంబ న్యాయస్థానం దీన్ని పట్టించుకోలేదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నా దాన్ని సాక్ష్యంగా పరిగణించకూడదని వాదించారు. చాలా క్రూరంగా హింసించడం వల్లనే దీన్ని రికార్డు చేయాల్సి వచ్చిందని భర్త తరఫు న్యాయవాది తెలిపారు. ఇది అదనపు సాక్ష్యమేమీ కాదని, ఒక అంశాన్ని నిరూపించడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు. దీంతో ఏకీభవించని న్యాయమూర్తి కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని