జ్యుడీషియల్‌ సర్వీసు పరీక్షల వాయిదా సరికాదు

మార్చి 20న జరగాల్సిన దిల్లీ హయ్యర్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌ (డీహెచ్‌జేఎస్‌) పరీక్ష-2022ను నాలుగు వారాలపాటు వాయిదా వేస్తూ దిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఎంతమాత్రం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 12 Mar 2022 05:27 IST

సీజేఐ ధర్మాసనం వెల్లడి

దిల్లీ: మార్చి 20న జరగాల్సిన దిల్లీ హయ్యర్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌ (డీహెచ్‌జేఎస్‌) పరీక్ష-2022ను నాలుగు వారాలపాటు వాయిదా వేస్తూ దిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఎంతమాత్రం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరీక్షకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తులు వారి దరఖాస్తు ఫారాలను మార్చి12వ తేదీలోగా తమకు సమర్పించాలని దిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఎ.డి.ఎన్‌.రావును చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం కోరింది. జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీ ఈ ధర్మాసనంలోని ఇతర న్యాయమూర్తులు. ఇదే పరీక్షకు సంబంధించి దాఖలైన మరో అభ్యర్థనలో పిటిషను ఫలితాన్నిబట్టి తన దరఖాస్తు ఫారాన్ని సమర్పించడానికి న్యాయవాది దేవీనా శర్మను అనుమతించారు. కరోనా మహమ్మారికి తోడు గత రెండేళ్లుగా ఈ పరీక్షను హైకోర్టు నిర్వహించకపోవడంతో జ్యుడీషియల్‌ సర్వీసులకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి అయిన 32 ఏళ్లలో కొంత సడలింపు ఇవ్వాలని ఈమె కోరుతున్నారు. జిల్లా జడ్జి పోస్టులకు 35 ఏళ్ల వయోపరిమితి నిర్ధరించడాన్ని కూడా సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచి ఎదుట పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ‘35 ఏళ్ల నిబంధనలో సడలింపు కోరుతున్న వ్యక్తులు హైకోర్టు ఎదుట కనీసం తమ దరఖాస్తులను సమర్పించే ప్రయత్నం కూడా చేయకపోవడం దురదృష్టకరం. అయినా 1,200కు పైగా దరఖాస్తులు వచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పొడిగింపు నిర్ణయం సరైంది కాదు’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 15న తదుపరి విచారణ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని