కొవిడ్‌ కాలంలో శత కోటీశ్వరులు ఎక్కువయ్యారు

దేశంలో 1920 నాటి తీవ్రమైన అసమానతలు వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. అయిదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సును దిల్లీలోని

Published : 17 May 2022 05:26 IST

ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో 1920 నాటి తీవ్రమైన అసమానతలు వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. అయిదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సును దిల్లీలోని హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ- 30 ఏళ్లలో పెరగని శతకోటీశ్వరుల సంఖ్య... కొవిడ్‌ నెలకొన్న రెండేళ్లలోనే ఎక్కువైందన్నారు. 1991లో దేశంలో బిలియన్‌ డాలర్లు ఉన్నవారు ఒక్కరు కూడా లేరనీ, ప్రస్తుతం అలాంటివారు 166 మంది ఉన్నారనీ... వీరి మొత్తం ఆస్తుల విలువ రూ.794 బిలియన్‌ డాలర్లని సాయినాథ్‌ విశ్లేషించారు. గ్రామాల్లో మూడింట రెండొంతుల కుటుంబాలు నెలకు రూ.5 వేల కంటే తక్కువ ఆదాయంతో నెట్టుకొస్తున్నాయని, 90% కుటుంబాల ఆదాయం రూ.10 వేల లోపే ఉందని వివరించారు.

ఆగస్టు 1న దేశవ్యాప్త ఆందోళనలు

అందరికీ ఉపాధి, ఇళ్లు, భూమి, ఆహారం, విద్య, వైద్యం, సమానత్వం కోసం విశాల ఐక్య సమరశీల ఉద్యమాలు చేపట్టాలని అయిదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సు పిలుపునిచ్చింది. ఇందుకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ కార్యాచరణ ప్రణాళికను, జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జూన్‌-జులై నెలల్లో రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. జులై 15 నుంచి 30 వరకూ గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రచార ఉద్యమం చేపట్టాలని; ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 500 గ్రామీణ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని సదస్సు పిలుపునిచ్చింది. సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే... గ్రామాల్లో సమ్మె చేపడతామని సదస్సు హెచ్చరించింది. వివిధ సంఘాల నాయకులు దుర్గా స్వామి, డి.ఎస్‌.కశ్యప్, దేవి రామ్, రామ్‌చౌదరి, గౌరవ్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని