Published : 26 May 2022 06:16 IST

విద్యుత్‌ పరివర్తనకు స్టీరింగ్‌ కమిటీలు

మరో రెండేళ్లలో సాగుకు డీజిల్‌ వాడకం వద్దు
ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి ఆర్‌.కె.సింగ్‌ లేఖ

ఈనాడు, దిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి నుంచి క్రమంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మళ్లాలని, ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయుల్లో స్టీరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్‌.కె.సింగ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. 2024 కల్లా వ్యవసాయ అవసరాల కోసం డీజిల్‌ వినియోగాన్ని జీరోకు తీసుకురావాలని సూచించారు. నీటిని తోడేందుకు సౌర విద్యుత్తు వాడాలని కోరారు. పీఎం - కుసుం స్కీం కింద వ్యవసాయ ఫీడర్లను వేరుచేసి వాటికి సౌర విద్యుత్తు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే స్టీరింగ్‌ కమిటీల్లోకి రాష్ట్ర ఇంధన, రవాణా, పరిశ్రమలు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రహదారులు.. భవనాల శాఖల ముఖ్య కార్యదర్శులను సభ్యులుగా నియమించాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా ఎంతమేర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచాలో లక్ష్యం నిర్దేశించుకొని దానిని చేరేలా చూసే బాధ్యత ఈ కమిటీదేనని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని అంతర్జాతీయ వేదికలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోడానికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మళ్లడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో స్టీరింగ్‌ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండును అందుకోడానికి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుతో పునరుత్పాదక ఇంధనం కలిపి వాడుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇందుకోసం బయోమాస్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగాన్ని పెంచాలని కోరారు. అలాగే ఇంధన సామర్థ్యాన్నీ పెంచుకోవాలని సూచించారు. 2005 నాటి కర్బన ఉద్గారాలతో పోలిస్తే 2030 నాటికల్లా 45% తగ్గించడమే లక్ష్యమని, దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని ఆర్‌.కె.సింగ్‌ పేర్కొన్నారు.


బకాయిల చెల్లింపులో డిస్కంలకు వెసులుబాటు
వాయిదా పద్ధతిలో చెల్లించే కొత్త విధానం!

దిల్లీ: దేశంలోని విద్యుత్తు సంస్థలకు డిస్కంలు రూ.లక్ష కోట్ల బకాయిలను ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లించే కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఉన్న బకాయిలను ఎలాంటి జరిమానా లేకుండా 48 నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు వీలు కల్పిస్తూ కొత్తపథకం ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల డిస్కంలు ఆలస్య చెల్లింపు కింద రూ.19,833 కోట్ల అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ తప్పుతుందని, ఆ మేరకు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించింది. 2022 మే 18 నాటికి డిస్కంల బకాయిలు రూ.1,00,018 కోట్లకు చేరాయి. ఆర్థిక వెసులుబాటు నోటిఫికేషన్‌ విడుదల చేసేనాటికున్న బకాయి (అసలు + లేట్‌ పేమెంట్‌ సర్‌ఛార్జి) మొత్తాన్ని ఫ్రీజ్‌ చేస్తారు. దానిపై తదుపరి లేట్‌ పేమెంట్‌ సర్‌ఛార్జి విధించరు. ఈ మొత్తాన్ని 48 వాయిదాల్లో చెల్లించడానికి డిస్కంలకు అనుమతి ఇస్తారు. ఒకవేళ ఈ నెలవారీ వాయిదాలను డిస్కంలు సకాలంలో చెల్లించకపోతే మొత్తం బకాయిలపై లేట్‌ పేమెంట్‌ సర్‌ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల వచ్చే 12 నుంచి 48 నెలల్లో డిస్కంలకు రూ.19,833 కోట్ల వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల తమిళనాడు, మహారాష్ట్రలకు రూ.4,500 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.2,500 కోట్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు రూ.1,100 కోట్ల నుంచి రూ1,700 కోట్ల ప్రయోజనం లభిస్తుంది. డిస్కంలు ఆలస్య రుసుం చెల్లించే బాధ్యత ఉండదు కాబట్టి ఆ భారం వినియోగదారులకూ బదిలీ కాదు’’ అని కేంద్ర విద్యుత్తుశాఖ పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని