Updated : 27 Jun 2022 08:40 IST

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ

నాడు దారుణ అణచివేతకు గురైన ప్రజాస్వామ్యం

ప్రజలు ఓటుతోనే సమాధానమిచ్చారు

జర్మనీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగం 

మ్యూనిక్‌: కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీలో తీవ్ర విమర్శలు చేశారు. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. దేశంలో అత్యయిక పరిస్థితి విధించడంపై మండిపడ్డారు. దేశ ఉజ్వల ప్రజాస్వామ్య చరిత్రలో అది ఓ మాయని మచ్చ అని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రజాస్వామ్యాన్ని నాడు దారుణంగా అణచివేశారని దుయ్యబట్టారు. అయితే ఈ కుట్రలన్నింటికీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానమిచ్చారని తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం జర్మనీలోని మ్యూనిక్‌ చేరుకున్న మోదీ.. ఇక్కడి ‘ఆడి డోమ్‌ స్టేడియం’లో వేలమంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి 30 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘‘నేడు జూన్‌ 26. సరిగ్గా 47 ఏళ్ల కిందట భారత్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురైన రోజు ఇది’’ అని పేర్కొన్నారు. నేడు ప్రజాస్వామ్యానికి భారత్‌ మాతృదేశమని దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ‘‘సంస్కృతి, ఆహారం, ఆహార్యం, సంగీతం వంటి అంశాల్లో ఉన్న వైవిధ్యం.. మన ప్రజాస్వామ్యాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దింది. ప్రజాస్వామ్యంతో సత్తా చాటగలమని భారత్‌ రుజువు చేసింది’’ అని పేర్కొన్నారు. దేశం సాధించిన విజయాలను చాటిచెప్పడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ విషయంలో వారు దేశానికి ‘బ్రాండ్‌ అంబాసిడర్లు’గా మారారని చెప్పారు. భారత వృద్ధి పథాన్నీ మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ‘‘గడిచిన శతాబ్దంలో జర్మనీ తదితర దేశాలు మూడో పారిశ్రామిక విప్లవం ద్వారా లబ్ధి పొందాయి. నేడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్‌ వెనుకబడిపోదు. ప్రపంచంలోనే ముందంజలో ఉంటుంది. భారత విజయాల గురించి చెప్పుకొంటూ పోతే మీ డిన్నర్‌ సమయం కూడా దాటిపోతుంది. సదుద్దేశంతో, సరైన నిర్ణయాలు తీసుకుంటే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్ఫర్మేషన్‌, డిజిటల్‌ టెక్నాలజీల్లో భారత్‌ తన సత్తా చాటుతోంది. ప్రపంచ డిజిటల్‌ లావాదేవీల్లో 40 శాతం వాటా భారతీయులదే. డేటా వినియోగంలో భారత్‌ కొత్త రికార్డులుసాధించింది. డేటా చౌకగాలభ్యమవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. అంకుర పరిశ్రమలకు, యూనికార్న్‌లకు అనువైన వాతావరణం దేశంలో ఉంది’’ అని పేర్కొన్నారు.

ఘన స్వాగతం 

మ్యూనిక్‌ విమానాశ్రయంలో మోదీకి జర్మనీలోని బవేరియా రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రత్యేక బవేరియన్‌ బ్యాండ్‌తో సాదరంగా ఆహ్వానించింది. గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకూ ఇలాంటి గౌరవం ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మోదీ సహా అనేక దేశాల నేతలకు విందు కూడా ఏర్పాటు చేసింది. జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానంపై మోదీ ఇక్కడికి వచ్చారు. జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే భారత్‌తోపాటు అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను ప్రత్యేకంగా షోల్జ్‌ ఆహ్వానించారు. జీ7 దేశాలతోపాటు ఆహ్వానిత దేశాల నేతలతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆదివారం ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌తో సమావేశమయ్యారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని