ఉదయ్‌పుర్‌లో భారీ ర్యాలీ

దర్జీ కన్హయ్య లాల్‌ దారుణ హత్యతో ఉలిక్కిపడ్డ ఉదయ్‌పుర్‌ నగరంలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. అవాంఛనీయ ఘటనలేవీ చోటుచేసుకోకుండా అక్కడ పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఏడు పోలీసు స్టేషన్ల

Updated : 01 Jul 2022 05:55 IST

 కన్హయ్య హత్యకు నిరసనగా ప్రశాంతంగా నిర్వహణ

ఉదయ్‌పుర్‌: దర్జీ కన్హయ్య లాల్‌ దారుణ హత్యతో ఉలిక్కిపడ్డ ఉదయ్‌పుర్‌ నగరంలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. అవాంఛనీయ ఘటనలేవీ చోటుచేసుకోకుండా అక్కడ పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. కన్హయ్య హత్యను నిరసిస్తూ ‘సర్వ హిందూ సమాజ్‌’ ఉదయ్‌పుర్‌లో పిలుపునిచ్చిన ర్యాలీ గురువారం ప్రశాంతంగా ముగిసింది. టౌన్‌ హాల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు హిందూ సంస్థల సభ్యులు సహా వేల మంది పాల్గొన్నారు. కాషాయ జెండాలను రెపరెపలాడించారు. ‘జై శ్రీరామ్‌’, ‘హిందువుల హత్యలు ఆపండి’ అంటూ కొంతమంది నినాదాలు చేశారు. నిర్దేశిత మార్గంలో కర్ఫ్యూ సడలించి ర్యాలీని అనుమతించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు- కన్హయ్య హంతకులకు ఉరిశిక్ష విధించాలంటూ రాష్ట్రపతికి రాసిన విజ్ఞాపన పత్రాన్ని కొంతమంది సాధువులు ఉదయ్‌పుర్‌లో కలెక్టర్‌కు అందజేశారు. బంద్‌ నేపథ్యంలో నగరమంతటా మార్కెట్లు గురువారం మూతపడ్డాయి.

కన్హయ్య కుటుంబసభ్యులకు గహ్లోత్‌ పరామర్శ

కన్హయ్య కుటుంబసభ్యులను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పరామర్శించారు. ఉదయ్‌పుర్‌లోని సెక్టార్‌ 14లో వారి ఇంటికి ఆయన గురువారం వెళ్లారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. కన్హయ్య హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలని, సాధ్యమైనంత త్వరగా అభియోగపత్రం దాఖలు చేయాలని పేర్కొన్నారు.

నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

కన్హయ్య హత్య కేసు నిందితులు రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహ్మద్‌లను పోలీసులు ఉదయ్‌పుర్‌లోని ఓ కోర్టులో గురువారం హాజరుపర్చారు. కోర్టు వారిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

విద్వేష ప్రసంగం కేసులో ముగ్గురి అరెస్టు

రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో విద్వేష ప్రసంగానికి సంబంధించి ఫకర్‌ జమాలీ అనే ఓ మత గురువుతో పాటు రియాజ్‌, తాజిమ్‌ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. జూన్‌ 17న అజ్‌మేర్‌ దర్గా వద్ద వారు చేసిన నినాదాలు.. విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గోహర్‌ చిస్తీ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ‘ప్రవక్తకు జరిగిన అవమానానికి.. తల నరికివేతే ఏకైక శిక్ష’ అని గత నెల 17 నాటి ర్యాలీలో వారు వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. వారి ప్రసంగాల వల్లే కన్హయ్య హత్య జరిగి ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.

అన్ని మతాలను గౌరవించాలి: గుటెరెస్‌

ప్రజలంతా అన్ని మతాలను గౌరవించాలని.. వివిధ వర్గాలవారు ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యాలతో జీవించేందుకు దోహదపడాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ పిలుపునిచ్చారు. కన్హయ్య హత్యపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు గుటెరెస్‌ తరఫున ఆయన అధికార ప్రతినిధి స్టెఫానె డుజారిక్‌ గురువారం ఈ మేరకు స్పందించారు. ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అందరూ గౌరవించాలని పేర్కొన్నారు.

* కన్హయ్య హత్య నేపథ్యంలో జాతీయ మైనార్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురా గురువారం విలేకర్ల సమావేశంలో స్పందించారు. నేరాలకు పాల్పడేవారు చట్టప్రకారం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

* ఉదయ్‌పుర్‌లో సంచలన హత్య వెనుక అంతర్జాతీయ స్థాయి కుట్ర దాగి ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని