Updated : 12 Jul 2022 15:13 IST

సంక్షిప్త వార్తలు

దిల్లీ: ‘ఓబీసీల ఉప వర్గీకరణ-ప్రయోజనాల సమాన పంపిణీ’ పరీశీలనకు ఏర్పాటైన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ గడువును మరో ఆరు నెలలు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం అంగీకారం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2017, అక్టోబరు 2న ఏర్పాటైన ఈ కమిషన్‌ గడువును పొడిగించడం ఇది 13వ సారి. దీంతో వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కమిషన్‌ కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది.


12 మంది ఎంపీలు మా వైపే

శిందే వర్గ మాజీ మంత్రి గులాబ్‌రావ్‌ పాటిల్‌ 

ముంబయి: ‘శివసేన తరఫున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది మాతో (ఏక్‌నాథ్‌ శిందే వర్గం) ఉన్నారు. 18 మంది ఎంపీల్లో 12 మంది ఇపుడు మా వెంటే వస్తామంటున్నారు. ఇందులో నలుగురితో నేను వ్యక్తిగతంగా మాట్లాడా. ఏది అసలైన శివసేన పార్టీయో చెప్పండి. 22 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా మాతోనే ఉన్నారు’ అని ఉద్ధవ్‌ ఠాక్రే మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యుడు గులాబ్‌రావ్‌ పాటిల్‌ తెలిపారు.   

లోక్‌సభలో చీఫ్‌విప్‌ను మార్చిన శివసేన

ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన బుధవారం లోక్‌సభలో తన చీఫ్‌విప్‌ను మార్చింది. ఎంపీ భావనా గావలీ స్థానంలో రాజన్‌ విచారేను కొత్త చీఫ్‌విప్‌గా నామినేట్‌ చేసినట్లు పార్టీ పార్లమెంటరీ నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి రాసిన లేఖలో రౌత్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ, మార్పు తక్షణం అమలులోకి వస్తుందన్నారు.  


22 మందితో మునిగిన ఓడ 

కాపాడిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌  

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని పోర్‌బందర్‌ ఓడరేవుకు 185 కిలోమీటర్ల దూరంలో ఓ వాణిజ్యనౌక భారీవర్షం, హోరుగాలి కారణంగా అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ‘గ్లోబల్‌కింగ్‌-1’ అనే ఈ నౌక నుంచి బుధవారం ఉదయం ప్రమాద హెచ్చరిక అందిన వెంటనే ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ (ఐసీజీ) బృందం అప్రమత్తమై నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది. వీరిని కాపాడేందుకు ఐసీజీ అత్యాధునిక ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ ఛాపర్లతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. సిబ్బందిలో 20 మంది భారతీయులు కాగా.. పాకిస్థాన్, శ్రీలంకల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ పడవలు, ఛాపర్లలో పోర్‌బందర్‌ ఓడరేవుకు తరలించారు. 6,000 టన్నుల తారు యూఏఈ నుంచి కర్ణాటకలోని కర్వార్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  


ముమ్మరంగా ద్రౌపదీ ముర్ము ప్రచారం 

ఈటానగర్, షిల్లాంగ్, ఈనాడు-గువాహటి: రాష్ట్రపతి ఎన్నిక ప్రచార ంలో అధికార ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము తీరిక లేకుండా గడుపుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఆమె బుధవారం పర్యటించారు. తనకు అనుకూలంగా ఓటెయ్యాలని అక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో సీఎం పెమా ఖండూ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బియూరామ్‌ వాగే తదితరులు ద్రౌపదికి ఘన స్వాగతం పలికారు. భాజపా, దాని మిత్రపక్షాలైన ఎన్‌పీపీ, జేడీయూలకు చెందిన ఎంపీలు, శాసనసభ్యులతో ఆమె సమావేశమయ్యారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బి.డి.మిశ్రతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. మేఘాలయలో ద్రౌపది అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ) నేతల మద్దతు కోరారు. పాలక పక్ష సభ్యులు ఆమెకే ఓటేయనున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ప్రకటించారు. మేఘాలయలో ప్రతిపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షాంగ్‌ప్లియాంగ్‌ కూడా ఎండీయే నేతలతో కలిసి ద్రౌపదితో సమావేశంలో పాల్గొన్నారు. నాగాలాండ్‌లో సీఎం నెఫియూ రియో సహా అధికార ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఏ) నేతలతో ద్రౌపది సమావేశమయ్యారు. వారంతా ఆమెకే మద్దతు ప్రకటించారు. 

జమ్మూ-కశ్మీర్‌లో పర్యటించనున్న యశ్వంత్‌ సిన్హా 

దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో బుధవారం సమావేశమైన పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు.. ఇప్పటివరకు రాష్ట్రాల్లో తమ అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటనలు సాగిన తీరుపై చర్చించారు. తెలంగాణలో సిన్హా ప్రచారానికి గొప్ప స్పందన లభించిందని ఆయన ప్రచార కార్యక్రమాల నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణి నివేదించారు. సిన్హా తదుపరి పర్యటనలకు పవార్‌ నేతృత్వంలో విపక్ష నేతలు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లో, శుక్రవారం గుజరాత్‌లో, శనివారం జమ్మూ-కశ్మీర్‌లో ఆయన పర్యటించేలా ప్రణాళిక ఖరారు చేశారు. తర్వాత బిహార్, ఝార్ఖండ్‌లాంటి రాష్ట్రాలకూ సిన్హా వెళ్తారు. 17న ముంబయి పర్యటనతో ప్రచార పర్వాన్ని ముగిస్తారు. జమ్మూ-కశ్మీర్‌లో అసెంబ్లీ లేదు. అయినప్పటికీ అక్కడి ప్రజలకు సంఘీభావంగా సిన్హా పర్యటనను ఖరారు చేశారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని