Updated : 07 Aug 2022 06:39 IST

సంక్షిప్త వార్తలు (5)


పీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు చెల్లించండి
కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిన సంస్థకు దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిన ఓ సుగంధ ద్రవ్యాల సంస్థకు దిల్లీ హైకోర్టు రూ.30 లక్షల జరిమానా విధించింది. దీంతో పాటు మరో రూ.25 లక్షలు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.ఈ మేరకు జస్టిస్‌ ప్రతిభా ఎమ్‌.సింగ్‌ ఉత్తర్వులు జారీచేశారు. గతంలోనూ ఆ సంస్థ కాపీరైట్‌ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. సంస్థ ప్రతినిధులు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కేవలం జరిమానాతో సరిపెడుతున్నట్లు పేర్కొన్నారు.


పోరాట దళాల కోసం 5జీ సేవలు
సైన్యం యోచన

దిల్లీ: ప్రధాన పోరాట దళాల కమ్యూనికేషన్‌ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు 5జీ సేవలను ఉపయోగించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. యుద్ధరంగంలో ఇది చాలా అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాల్లో 5జీ సేవల అమలు కోసం ఇటీవల నిర్వహించిన ఉమ్మడి అధ్యయనంలో సైన్యం ముఖ్య పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆ నివేదికను మూడు దళాలూ పరిశీలిస్తున్నాయి. 5జీ సేవల్లో అధిక బ్యాండ్‌ విడ్త్‌, తక్కువ లేటెన్సీ ఉంటాయి. సైన్యంలో ప్రధాన దళాల కమ్యూనికేషన్‌ అవసరాలను తీర్చడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.


నిర్దోషిగా ప్రకటించిన ఉత్తర్వుల్లో తేలిగ్గా జోక్యం చేసుకోకూడదు: సుప్రీం

దిల్లీ: నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో అంత తేలిగ్గా జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తన భార్యను హింసకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో సరైన కారణాలు లేకుండా జోక్యం చేసుకోకూడదన్నది ఇప్పటికే అనుసరిస్తున్న విధానం. ఒక వేళ విడుదల చేయాలనుకుంటే సంబంధిత కోర్టు చూపిన ప్రతి కారణాన్ని అప్పిలేట్‌ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ కేసులో హైకోర్టు అలా చేసినట్లు లేదు’’ అని పేర్కొంటూ.. 2019లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది.


పడవలో చెలరేగిన మంటలు ఐదుగురు కూలీల దుర్మరణం

పట్నా: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోన్‌ నదిలో పట్నా రాంపుర్‌ దియరా ఘాట్‌ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పడవలోని డీజిల్‌ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ పడవలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ లీకై ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. పడవలో సిలిండర్‌ తీసుకెళ్లడం నిషేధం.


కొత్తగా 19,406 కేసులు..

దిల్లీ: దేశంలో గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉ. 8 వరకు) కొత్తగా 19,406 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 49 మంది మృతిచెందారు. క్రియాశీలక కేసుల సంఖ్య 1,34,793కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96% నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,41,26,994కి చేరగా మహమ్మారి బారినపడి ఇంతవరకు 5,26,649 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని