AAP: ఈడీ ఛార్జ్‌షీట్‌ నిందితుల జాబితాలో ఆప్‌ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు

దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌లోని నిందితుల జాబితాలో చేర్చనుంది.

Updated : 10 May 2024 10:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్లను నిందితులుగా ప్రస్తావించనుంది. ఈ దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చినట్లవ్వనుంది. దీంతో పాటు ఆ పార్టీ ఆస్తుల్లో కొన్నింటిని అటాచ్‌ చేసే అవకాశాలున్నాయి.

సుప్రీం కోర్టులో నేడు కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై విచారణ అనంతరం ఈ ఛార్జ్‌షీట్‌ను సమర్పించే అవకాశం ఉంది. ఒక వేళ రోజంతా వాదనలు జరిగితే మాత్రం రేపు న్యాయస్థానానికి ఇవ్వొచ్చు. దీనిలో కేజ్రీవాల్‌ సహా మరికొందరు నిందితులు, వారికి సంబంధించిన సంస్థల పేర్లను కూడా ప్రస్తావించనున్నారు. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందనేది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దీనిలో నిరూపించే అవకాశాలున్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద వీరిపై కేసులు ఫైల్‌ చేయనున్నారు.

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు నేడు వాదనలు విననుంది. దీన్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం చేసే హక్కు అనేది.. ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందకు రాదు. మాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా సరే ఆ వెసులుబాటు లభించలేదు. గతంలో మేం సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్‌ ఇలాంటి కారణాలే చూపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు రాలేదు. గత మూడేళ్లలో పలుసార్లు ఎన్నికలు జరిగాయి. సంవత్సరమంతా ఏదో ఒకచోట.. ఏవో ఒక ఎన్నికలు ఉంటూనే ఉన్నాయి. ఇలా ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ మంజూరుచేస్తే ఏ రాజకీయ నేతను అరెస్టు చేయలేం. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచలేం’’ అని ఈడీ తమ అఫిడవిట్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని