మీ భూమి ఉందా?.. తరిగిందా?

తండ్రి ఇచ్చిందో.. తాత ద్వారా వచ్చిందో.. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకుందో... ఎకరమో.. అరెకరమో.. కంటికి రెప్పలా చూసుకుంటున్న భూమి.. కన్నతల్లిలా కాపాడుకుంటున్న భూమి... ఎవరో వచ్చి అందులో కొంత భాగం నీది కాదు అంటే... కాళ్ల కింది నేల కదలదా?

Published : 10 May 2024 05:12 IST

రైతుల గుండెలపై భూ కుంపటి
రీ-సర్వేతో గ్రామాల్లో చిచ్చు
రైతుల భూ విస్తీర్ణాల్లో భారీగా కోత
క్రయ, విక్రయాలపై తీవ్ర ప్రభావం
బ్యాంకు రుణాల కోసం అష్టకష్టాలు
ఈనాడు, అమరావతి, కర్నూలు

తండ్రి ఇచ్చిందో.. తాత ద్వారా వచ్చిందో.. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకుందో...
ఎకరమో.. అరెకరమో.. కంటికి రెప్పలా చూసుకుంటున్న భూమి.. కన్నతల్లిలా కాపాడుకుంటున్న భూమి...
ఎవరో వచ్చి అందులో కొంత భాగం నీది కాదు అంటే... కాళ్ల కింది నేల కదలదా? గుండె పగలదా? ఆవేశం కట్టలు తెంచుకోదా?
ఇప్పుడు రాష్ట్రంలో లక్షల మంది రైతుల పరిస్థితి ఇదే...
రీ సర్వే పేరుతో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న భూదందా ఇది...
సత్సంకల్పం, సమగ్రత, పారదర్శకత లేకుండా నడుస్తున్న ఈ రాక్షస చర్య అన్నదాతలకు అంతులేని ఆవేదన కలిగిస్తుంటే...
అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నవారి మధ్య ఆరని చిచ్చుపెడుతోంది.


రాష్ట్రంలోని భూములన్నిటినీ ‘సమగ్ర రీ-సర్వే’ చేయించి, యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న జగన్‌ రైతుల కొంప ముంచారు. ఇంతకుముందు రైతులు అవసరమైనా, అనుమానం ఉన్నా సర్వే కోసం దరఖాస్తు చేసుకుని కొలతలు వేయించుకునే వారు. దీనివల్ల వారి భూముల విస్తీర్ణంలో ఎటువంటి మార్పు వచ్చేది కాదు. క్రయ, విక్రయాలు సాఫీగా జరిగిపోతుండేవి. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న విస్తీర్ణానికి తగ్గట్లు బ్యాంకుల నుంచి రుణాలు కూడా వచ్చేవి. ఇలాంటి విధానంలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే అందులో సమగ్రత, పారదర్శకత ఉండాలి. రైతుల విశ్వాసాన్ని చూరగొనాలి. కానీ జగనన్న రీసర్వేతో అనేక రకాల సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఫలితాలు చూసి రైతుల కళ్లు   బైర్లు కమ్ముతున్నాయి. నాలుగైదు సెంట్లు మొదలుకొని ఒకటి, రెండు ఎకరాల వరకు భూములను కర్షకులు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఒక ప్రాంతానికో..ఒక జిల్లాకో పరిమితం కాలేదు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్నిచోట్లా ఇదే స్థితి. రీ-సర్వేలో ఎదురైన నష్టాలు తలుచుకొని.. రైతులు పొలం గట్ల దగ్గర కూర్చుని విలపిస్తున్నారు. ఇవేవీ తన దృష్టికి రాలేదన్నట్లు జగన్‌ బస్సు యాత్రల్లో రీసర్వే అద్భుతమని గప్పాలు కొడుతున్నారు.


కాగితాలపైనే నిబంధనలు..

రెవెన్యూ, సర్వే అధికారులు ఆయా ఫిర్యాదుల ఆధారంగా నిర్ణీత సర్వే నంబరులోని రైతులతోపాటు పరిసర ప్రాంతాల రైతులను పిలిపించి వారందరి సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించాలి. పంచనామా ప్రక్రియలో ఎవరి భూమి ఎవరికి కలిసిందన్న విషయాన్ని అందరి సమక్షంలో వివరంగా చెప్పి ఖరారు చేయాలి. కానీ గ్రామాల్లో జరుగుతోంది వేరు. కొందరు రైతుల నుంచి అందినకాడికి దండుకుని... ఇతర రైతుల భూ విస్తీర్ణాలకు కోతపెడుతున్న సిబ్బంది అడంగళ్‌ కాపీలను మార్చేస్తున్నారు. కోతపెట్టిన భూములను వారికి నచ్చిన విధంగా పక్కనే ఉన్న రైతులకు కలిపేస్తున్నారు. చాలాచోట్ల రైతులతో సంబంధం లేకుండా.. వారికి సమాచారం ఇవ్వకుండా.. సర్వే సిబ్బంది భూములను కొలుస్తున్నారు. తమ భూమి విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారని వెళుతున్న రైతులకు అధికారులు.. పక్కనున్న రైతులతో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. మరికొందరు రీసర్వేకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతూ చేతులు దులుపుకొంటున్నారని రైతులు వాపోతున్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లు రీ-సర్వే చేశామని అధికారులకు నివేదించడానికే సిబ్బంది అధిక ప్రాధాన్యమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పక్కాగా కొలుస్తున్నామా? రైతులకు న్యాయం చేస్తున్నామా? అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు.


పట్టాదారు పుస్తకాల్లో తప్పులు...కర్షకుల కన్నీళ్లు...

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఇస్తున్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లుతున్నాయి. భూవిస్తీర్ణం, పేర్లు, ఇతర వివరాల్లో తప్పుల వల్ల రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు. రీ సర్వే అనంతరం ఇచ్చే పాసు పుస్తకాలపై జగన్‌ చిత్రాలు ఎందుకని రైతులు నిలదీస్తున్నారు. పల్లెల్లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రీసర్వే వల్ల లేని సమస్యలు వస్తాయని జిల్లాల అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తెస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం కంటే కొందరికి తక్కువగా నమోదవుతోంది. మరికొందరికి పెరుగుతోంది. కొన్నిచోట్ల ఇద్దరు ముగ్గురికి కలిపి జాయింట్‌ ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాపింగ్‌ (ఎల్పీఎం) నంబరు ఇస్తున్నందున వారి మధ్య గొడవలవుతున్నాయి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు అందిస్తున్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లోనూ తప్పులు దొర్లుతున్నాయి. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు అందడంలేదు. రీ సర్వే సమయంలో పక్కపక్కనే ఉన్న రైతుల మధ్య విస్తీర్ణం విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పుడు వారికి సర్దిచెప్పి, సమస్యను పరిష్కరించాల్సిన సిబ్బంది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారికి విడివిడిగా కాకుండా... జాయింట్‌ ల్యాండ్‌ పార్సిల్‌ నంబరు (సర్వే నంబరు స్థానంలో) ఇస్తున్నారు. ఒక రైతుకు చెందిన భూహక్కు పత్రంలో పక్కవారి పేర్లనూ చేరుస్తున్నారు. సిబ్బంది వెళ్లిన సమయంలో రైతులు లేరన్న కారణంతోనూ జాయింట్‌ ఎల్పీఎం నంబరు ఇస్తున్నారు. రీ సర్వేలో భాగంగా పొలాల దగ్గరకు వెళ్లి హద్దులు గుర్తించడంతోపాటు మృతుల పేరిట ఉన్న యాజమాన్య హక్కులను వారి కుటుంబీకులకు బదలాయించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలి. రైతుల నుంచి సేకరించిన భూ యాజమాన్య పత్రాల ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. రీ-సర్వేను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నందున పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లుతున్న తప్పులు  రైతులకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.


అభ్యంతరాలు భేఖాతరు!

రీ-సర్వే పూర్తై భూ యాజమాన్య రికార్డు (ఆర్‌ఓఆర్‌)ల్లో వివరాలు నమోదు జరిగినట్లు ప్రకటించిన రోజు నుంచి ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ పట్టాదారు పాసుబుక్‌ యాక్ట్‌-1971, 1989 సెక్షన్‌ 3 (3) ప్రకారమే కాకుండా.రూల్‌.17 ప్రకారం అప్పీల్‌ లేదా అభ్యంతరాలు రైతులకు తెలియచేసే అవకాశం ఉన్నా... రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రీసర్వే పూర్తయి భూ యాజమాన్య రికార్డు (ఆర్‌ఓఆర్‌)లలో వివరాలు నమోదు జరిగినట్లు ప్రకటించిన రోజు నుంచి అభ్యంతరాలపై అప్పీల్‌ చేసుకోవడానికి కొందరు రైతులు ప్రయత్నిస్తున్నా..అధికారులు పట్టించుకోవడంలేదు. వేర్వేరు ప్రాంతాల్లో యజమానులు, రైతులు తమ అభ్యంతరాలను వాట్సప్‌, జూమ్‌ కాల్స్‌ ద్వారా తెలియచేస్తే పరిగణనలోనికి తీసుకోవాలని మొబైల్‌ మేజిస్ట్రేట్‌/సర్వే అధికారులకు ఆదేశాలున్నా.. అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. భౌతికంగా రీ-సర్వే నిర్వహణకు హాజరుకాలేదని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు తిరస్కరించకూడదు. తమ తరఫున ఎవరి ద్వారానైనా సమాచారాన్ని పంపిస్తే దానిన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని, ఆ విధంగానే రికార్డుల్లో నమోదు చేయాలి. రీసర్వే ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు భూ యజమానులకు తెలిపిన విధానం గురించి రికార్డుల్లో స్పష్టంగా నమోదుచేయాలి. కానీ.. ఆచరణలో ఇలా జరుగుతుందో.. లేదో అర్థంకావడం లేదు. రీ సర్వేలో గ్రామ సర్వేయర్‌, గ్రామ రెవెన్యూ అధికారులది కీలకపాత్ర. రీ సర్వేలో భాగంగా భూమిపై ప్రతి సర్వే నంబరును తనిఖీ చేసి, ప్రతి సబ్‌డివిజన్‌లోని కమతాల విస్తీర్ణాన్ని ‘కార్స్‌’ ద్వారా సర్వేచేస్తారు. ప్రతి డివిజన్‌కు అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సర్వే చేయాలి. రోవర్ల ద్వారా సర్వే జరుగుతోంది. అయితే..రైతులకు సమాచారం ఇవ్వకుండానే.. వారు లేనప్పుడు సిబ్బంది పొలాలవద్దకు వెళ్తున్నారు. హడావుడిగా సర్వే చేస్తూ హద్దులు మార్చేస్తూ సర్వే రాళ్లు పెట్టిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికంటే తక్కువ విస్తీర్ణాన్ని రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో నమోదు చేస్తున్నందున రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 6వేల గ్రామాల్లోనే రీ-సర్వే పూర్తయింది. ప్రతిచోటా 25% మంది రైతుల భూముల విసీర్ణం ఖరారులో అన్యాయం జరిగిందని విలపిస్తున్నారు. రీ-సర్వేను వైకాపా ప్రభుత్వం రాజకీయ కోణంలో చేస్తుండడంతో గ్రామాల్లో చిచ్చు రేగుతోంది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే రైతుల మధ్య మనస్ఫర్థలు తలెత్తుతున్నాయి. కుటుంబాల పరువు ప్రతిష్ఠలను బజారుకీడిస్తున్నాయి. పూర్వార్జితం కింద వచ్చిన భూముల విస్తీర్ణం సైతం తగ్గిందని కర్షకులు గగ్గోలు పెడుతున్నారు.


జరగాల్సింది ఇలా..!

రీ-సర్వే నిర్వహణకు ముందు ఆయా గ్రామాల భూ రికార్డుల స్వచ్ఛీకరణ జరగాలి. క్షేత్రస్థాయిలో ఉన్న పొలాల విస్తీర్ణం, గట్ల వివరాలు, యజమానుల పేర్ల మధ్య పొంతన ఉండాలి. వీటిని పరిశీలించే క్రమంలో గమనించిన వ్యత్యాసాలను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం...రెవెన్యూ సిబ్బంది సరిచేయాలి. ఆ తరువాత గ్రామ సచివాలయానికి చెందిన సర్వేయర్‌, వీఆర్వో, వీఆర్‌ఏ గ్రామాలకు వెళ్లి... రైతన్నలతో మమేకమై రోవర్‌ సాయంతో పొలాల విస్తీర్ణం, గట్లకు కొలతలు వేసి, నిర్ధారణ చేయాలి. అభిప్రాయ భేదాలు వస్తే..రైతులకు విడమర్చి చెప్పి... ఆమోదాన్ని పొందాలి. చివరిగా గ్రామాల్లో రీ-సర్వే పూర్తయినట్లు ప్రకటించే ముందు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిశీలించాలి.  

జరిగింది ఇదీ!

జగనన్న రీ-సర్వేను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు. నిదానంగా..పారదర్శకంగా..రైతులతో మమేకమై జరగాల్సిన రీ-సర్వేను జగన్‌ హడావుడిగా చేస్తున్నందున ఫలితాలు కనిపించకపోగా...కొత్త సమస్యలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఉన్నా...రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేస్తున్నారు. విస్తీర్ణం ఖరారుపై రైతులు లేవనెత్తే అభ్యంతరాలు, వారి ఆందోళనల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. వీరి ఆవేదన వినే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. ప్రమాణాల ప్రకారం రోజుకి 20 నుంచి 30  ఎకరాల వరకు మాత్రమే కొలతలు వేయడానికి సాధ్యమవుతుంది. కానీ...ఇప్పుడు రోజుకు వంద ఎకరాలకుపైగానే కొలతలు వేస్తున్నారు.


కర్నూలు... కన్నీరు మున్నీరు!

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మొత్తం 914 రెవెన్యూ గ్రామాల్లో 490 చోట్లే సర్వే పూర్తయింది. ఇప్పటివరకు మొత్తం 86,910 పట్టాదారు పాసు పుస్తకాలు, నంద్యాలలో 73,750 పాసు పుస్తకాలు అందజేశారు. భూ విస్తీర్ణాల్ని మార్చేసి.. నూతన విస్తీర్ణాలతో పాసు పుస్తకాలను చేతుల్లో పెడుతుండడంతో వేల మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భూములున్న రైతులు వారికున్న భూవిస్తీర్ణాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పరిశీలించుకోకపోతే వారి భూమి మాయమయ్యే పరిస్థితులు తలెత్తాయి. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో గురుప్రసాద్‌ అనే రైతు ఆన్‌లైన్లో తన భూములకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తుండగా... భూ   విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లు గుర్తించి హతాశులయ్యారు. ఆయనకు ప్యాలకుర్తిలోని సర్వే నంబర్లు 477, 475లలో 3.99ఎకరాలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 32 సెంట్లు తగ్గింది. రహదారికి అత్యంత సమీపంలో ఉన్న ఆ భూమి విలువ కనీసం రూ.32 లక్షలు ఉంటుందని అంచనా. తనకు తెలియకుండా సర్వే నంబరును సబ్‌ డివిజన్‌ చేయడం... నిబంధనలను ఉల్లంఘించడంపై బాధిత రైతు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  ‘నాకు సర్వే నంబర్‌ 70-1లో 1.87ఎకరాలుండగా... కొత్త పట్టాదారు పాసు పుస్తకంలో 1.34 ఎకరాలున్నట్లు చూపారు. 53 సెంట్ల భూమి ఏమైందని అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానంలేదు’ అని శంకరబండకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి గగ్గోలుపెడుతున్నారు. నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో ఏ రైతును కదిపినా తమకు భూమి తగ్గిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.  వెయ్యిమంది రైతుల్లో 80 శాతం మందికి ఇచ్చిన పాసుపుస్తకాల్లో అన్నీ తప్పులతడకలే ఉన్నాయి. దీంతో ఆ గ్రామానికి చెందిన 50 మంది రైతులు బండి ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేశారు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చి ఐదు నెలలైనా  వారి సమస్య పరిష్కారం కాలేదు. పెదకడుబూరు మండలం హులికన్విలో అప్పల నాగరాజు, అప్పల ఉరుకుందులకు చెందిన భూముల్ని రీ-సర్వే చేసి  విస్తీర్ణాన్ని 33 సెంట్లు తగ్గించారు. దాన్ని ఉపాధ్యాయులైన  మహదేవ, చిన్న ఈరన్నలకు కలపడంతో వివాదమైంది. ఉపాధ్యాయుల తరపున పంచాయతీ చేయడానికి ఒక విశ్రాంత డీఎస్పీ వచ్చారు. ఆయనతో పాటు వచ్చిన ఓ వ్యక్తి  తుపాకీతో కాల్చేస్తానంటూ తమను బెదిరించారని బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విశ్రాంత డీఎస్పీ, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక న్యాయవాదితో సహా మొత్తం ఎనిమిది మంది అరెస్టయ్యారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని