Virat Kohli: ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్

వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్‌ అవకాశాలను కాపాడుకుంది.

Published : 10 May 2024 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) నుంచి మరో చక్కటి ఇన్నింగ్స్‌ వచ్చింది. పంజాబ్‌పై 47 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతడి స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మొత్తం 12 మ్యాచుల్లో 634 పరుగులు చేసినా.. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో మరీ నెమ్మదిగా ఆడాడని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా పంజాబ్‌పై విజృంభించిన విరాట్.. వాటన్నింటికీ సమాధానం ఇచ్చాడు. ఆటలో నాణ్యతే ముఖ్యమని.. ఎన్ని పరుగులు ఎలా చేశామనేది కాదని వ్యాఖ్యానించాడు.

‘‘నా వరకు క్రికెట్‌లో ఎప్పుడూ క్వాలిటీ అత్యవసరమని నమ్ముతా. క్వాంటిటీని పట్టించుకోను. గేమ్‌ పరిస్థితి అంచనా వేస్తూ ఆడాలి. దాని కోసం పెద్దగా ప్రాక్టీస్‌ చేయనక్కర్లేదు. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్‌లను చాలాసార్లు ఆడా. ఇప్పటికీ నా ఆట తీరులో మెరుగు కావడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. స్పిన్ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌ షాట్లను ఆడటంతో వారిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వీలు కలిగింది. వీటి కోసం నేను పెద్దగా ప్రాక్టీస్‌ చేయలేదు. వాటిపై పూర్తి అవగాహన ఉంది. స్పిన్‌ వేసేటప్పుడు ఫీల్డింగ్‌ సెటప్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కొన్నిసార్లు రిస్క్‌ తీసుకుంటే ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. అలా ఆడాలంటే మనమీద మనకు నమ్మకం ఉండాలి. నా స్ట్రైక్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. 

నిజాయతీగా చెప్పాలంటే.. ఈ సీజన్‌ తొలి అర్ధభాగంలో మేం అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. చాలా వెనుకబడిపోయాం. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా.. ఆత్మగౌరవం కోసం ఆడాలనే పరిస్థితుల్లో ఉన్నాం. అభిమానులను గర్వపడేలా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలా వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే ప్లేఆఫ్స్‌ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదు’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు అతడినే వరించింది.

అవకాశాలు ఉన్నా..

పంజాబ్‌తో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 241/7 స్కోరు చేసింది. అనంతరం పంజాబ్‌ 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి.. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ప్లేఆఫ్స్‌నకు చేరుకోవడానికి స్వల్ప అవకాశాలు మాత్రమే బెంగళూరుకు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని