prathinidhi 2 review: రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్‌ పొలిటికల్‌ డ్రామా ఎలా ఉంది?

Prathinidhi 2 Review: నారా రోహిత్‌ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా?

Published : 10 May 2024 06:57 IST

Prathinidhi 2 Review; చిత్రం: ప్రతినిధి2; నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, ర‌ఘు కారుమంచి త‌దిత‌రులు; సంగీతం: మహతి స్వర సాగర్; ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల; సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి; క‌ళ‌: కిరణ్ కుమార్ మన్నె; పోరాటాలు: శివరాజు & పృథ్వీ; నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని; దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు; నిర్మాణ సంస్థ‌లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్; విడుద‌ల‌: 10-05-2024

ఎన్నిక‌ల సీజ‌న్ రాగానే రాజ‌కీయం నేప‌థ్యంలో సాగే సినిమాలు థియేట‌ర్ల ముందుకు వ‌ర‌స క‌డుతుంటాయి. ప్రేక్ష‌కులంతా అదే మూడ్‌లో ఉంటారు  కాబ‌ట్టి త‌గిన సీజ‌న్ ఇదే అని భావిస్తూ ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు రాజ‌కీయ ప్ర‌ధానంగా సాగే సినిమాల్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంటారు. ఈసారి ఆ జాబితాలో క‌నిపించిన కీల‌క‌మైన సినిమా... ‘ప్ర‌తినిధి2’.  నారా రోహిత్ గతంలో చేసిన ‘ప్ర‌తినిధి’ సినిమాకి కొన‌సాగింపుగా ఇది రూపొందింది. పాత్రికేయుడు మూర్తి దేవ‌గుప్తుపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?(Prathinidhi 2 Review) ఈ ప్రతినిధి ఎవర తరపున పోరాటం చేశాడు?

క‌థేంటంటే: నిజాన్ని నిర్భ‌యంగా  వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే  చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: వ్య‌వ‌స్థ‌ని ప్ర‌శ్నించ‌డ‌మే ప్ర‌ధానంగా ‘ప్ర‌తినిధి’ చిత్రం తెర‌కెక్కింది. అందులో ఓ కామ‌న్ మేన్‌గా క‌నిపించిన నారా రోహిత్‌... ఈసారి ప్ర‌జాస్వామ్యానికి మూల‌ స్తంభాల్లో ఒక‌టైన జర్న‌లిజంలో ఉంటూ ప్ర‌శ్నించే యువ‌కుడిగా క‌నిపిస్తాడు. నారా రోహిత్... మూర్తి క‌ల‌యిక అన‌గానే  స‌హజంగానే ఇది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుంద‌నే ఓ అంచ‌నాలో ఉంటారు చాలా మంది. (Prathinidhi 2 Review)  కానీ, ఈ క‌థ అందుకు పూర్తి భిన్నంగా తెర‌కెక్కింది. ముఖ్య‌మంత్రి హ‌త్య‌, ఆ త‌ర్వాత ఆయ‌న కొడుకు ఆ ప‌ద‌వి చేపట్టాల‌నుకోవ‌డం వంటి విష‌యాలు గ‌తంలో తెలుగు రాజ‌కీయాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్ని గుర్తు చేసినా...  దానికంటే కూడా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ పొలిటిక‌ల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు ద‌ర్శ‌కుడు. ఏ ఒక్క పార్టీకో ఉప‌యోగ‌ప‌డే సినిమాగా కాకుండా... జ‌ర్న‌లిజం, రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల్ని త‌న‌దైన‌కోణంలో ఆవిష్క‌రించారు. తొలి స‌గ‌భాగంలో క‌లం చేత‌ప‌ట్టిన క‌థానాయ‌కుడు...ద్వితీయార్ధంలో క‌త్తి ప‌డ‌తాడు. ఆ క్ర‌మంలో చోటు చేసుకునే మ‌లుపులు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

ఆరంభ స‌న్నివేశాలు క‌థానాయ‌కుడి పాత్ర నైజాన్ని... జ‌ర్న‌లిజం గొప్ప‌త‌నాన్ని చాటుతాయి. క‌థానాయ‌కుడు ఎన్‌.ఎన్‌.సి  ఛాన‌ల్‌లో బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. మంత్రి గ‌జేంద్ర (అజ‌య్ ఘోష్‌)  అరాచ‌కాల్ని ప్ర‌శ్నించి అత‌ని ప‌ద‌వి పోయేలా చేయ‌డం, తర్వాత జ‌రిగే ఉప  ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షం నుంచి పోటీ చేసిన  న‌ర‌సింహ (పృథ్వీరాజ్‌) చేసిన ఆకృత్యాల్ని  వెలుగులోకి తీసుకు రావడం... ఆ నేప‌థ్యంలో పండే డ్రామా సినిమాకి కీల‌కం.  ఓటు విలువ‌ని చాటి చెబుతూ తీర్చిదిద్దిన స‌న్నివేశాలూ చిత్రానికి బ‌లం. (Prathinidhi 2 Review in telugu) విరామ స‌న్నివేశాల‌కి ముందు చోటు చేసుకునే మ‌లుపు ద్వితీయార్ధంపై ఆస‌క్తిని పెంచుతుంది. అప్ప‌టిదాకా స‌హ‌జంగా సాగుతున్న‌ట్టుగా అనిపించిన సినిమా... ఆ త‌ర్వాత క‌థ‌, క‌థ‌నాలు మ‌రీ నాట‌కీయంగా మారిపోతాయి. ఓ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో బాంబు పేలుడు, ఆ త‌ర్వాత చోటు చేసుకునే ప‌రిణామాలు, కేంద్ర‌మంత్రి స్పందిస్తే త‌ప్ప  అవి ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌కి తెలియ‌క‌పోవ‌డం వంటి విష‌యాలు అసంబద్ధంగా అనిపిస్తూ,  సినిమా గ‌తిని మార్చేశాయి. మ‌రీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని ఆ స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో  క‌థానాయ‌కుడి కుటుంబ నేపథ్యం, అత‌ని ల‌క్ష్యం, పాట‌లు, ఫైట్లు...  ఇవ‌న్నీ ఓ స‌గ‌టు ఫార్ములా తెలుగు సినిమా క‌థ‌ల్నే గుర్తు చేస్తాయి త‌ప్ప కొత్త‌దనం ఏమీ క‌నిపించ‌దు. ముఖ్య‌మంత్రిపై హ‌త్యాయత్నం వెన‌క ఎవ‌రున్నార‌నే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే స‌న్నివేశాలు మాత్రం ఆస‌క్తిక‌రంగా సాగుతాయి.  ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌రిశోధ‌న సంస్థ  సీబీఐని ఇందులో  మ‌రీ సాదాసీదాగా చూపించ‌డం పెద్ద‌గా మెప్పించ‌దు.  మొత్తంగా మ‌న మార్క్ మసాలాతో రూపొందిన మ‌రో స‌గ‌టు చిత్రం... ప్ర‌తినిధి 2. అక్క‌డ‌క్క‌డా కొన్ని మెరుపులు ఉన్నాయి.

ఎవ‌రెలా చేశారంటే: గాఢ‌త‌తో కూడిన చే త‌ర‌హా పాత్రలు నారా రోహిత్‌కి  బాగా నప్పుతాయి. జ‌ర్న‌లిస్ట్‌గా ఆయ‌న క‌నిపించిన తీరు, ప్ర‌శ్నించే విధానం ఆక‌ట్టుకుంటుంది. భావోద్వేగాలు, పోరాట స‌న్నివేశాలపైనా ప్ర‌భావం చూపించాడు.  ప్ర‌థ‌మార్ధంలో ఆయ‌న న‌ట‌న చిత్రానికి హైలైట్‌. ఆరంభ స‌న్నివేశాల్లో గెట‌ప్ బాగుంది.  కథానాయిక సిరి లెల్లా సినిమా అంతా కనిపించినా, ద్వితీయార్ధంలోనే ఆమె క‌థానాయిక అని తెలుస్తుంది.  స‌చిన్ ఖేడ్కర్‌, దినేశ్ తేజ్‌, జిషుసేన్ గుప్తా, అజ‌య్ ఘోష్‌, పృథ్వీరాజ్, ఉద‌య‌భాను పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్‌ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తారు. 

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నాని చ‌మిడిశెట్టి కెమెరా ప‌నిత‌నం, మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి బ‌లం.  ద్వితీయార్ధంలో ఎడిటింగ్ ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. స్వ‌త‌హాగా జ‌ర్న‌లిస్ట్  అయిన మూర్తి దేవ‌గుప్త‌పు ఆ నేప‌థ్యాన్ని కొత్త‌గా ఆవిష్క‌రించిందేమీ లేదు కానీ, మ‌న ప్రేక్ష‌కుల అబిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా ఓ మంచి వాణిజ్య  ప్ర‌ధాన‌మైన సినిమాని అందించే ప్ర‌య‌త్నం చేశారు. (Prathinidhi 2 Review) ఆయ‌న రాసుకున్న మాట‌లు ఆలోచింప‌జేస్తాయి. ‘మ‌నం ప‌వ‌ర్‌లో ఉంటే... మ‌నపై కేసుల‌న్నీ కోర్టుల్లోనే ఉంటాయి’,  ‘దేశాన్ని కాపాడ‌టానికి సైనికుడు, క‌డుపు నింప‌డానికి రైతు ఎంత ముఖ్య‌మో, స‌మాజానికి జ‌ర్న‌లిస్ట్ కూడా అంతే ముఖ్యం’  త‌ర‌హా సంభాష‌ణ‌లతోపాటు, నిజం వెలుగులోకి రాక‌పోతే సామాన్యుడు త‌ల్లడిల్లిపోతాడు, ఓటు  ఎంత ముఖ్య‌మో  చెప్పే సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేస్తాయి. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.  

  • బ‌లాలు
  • + నారా రోహిత్ న‌ట‌న
  • + క‌థ‌లో మ‌లుపులు
  • + ఓట‌రుని చైత‌న్యవంతం చేసే స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్ధంలో నాట‌కీయ‌త
  • చివ‌రిగా..: ప్ర‌తినిధి 2... ప్ర‌శ్నించే గొంతుక (Prathinidhi 2 Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని