India-Maldives: మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు

India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు.  

Updated : 10 May 2024 10:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లక్షద్వీప్‌లో చేసిన పర్యటనపై మాల్దీవుల(Maldives) మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత నుంచి రెండుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ మనదేశానికి వచ్చారు. ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో అపార్థాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆ దశను దాటేశాం. భారత్‌-మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి’’ అని వెల్లడించారు.

పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

ఈ ఏడాది జనవరిలో మోదీ లక్షద్వీప్‌ (Lakshadweep)లో పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరారు. అనంతరం సముద్రంలో స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు.. తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ.. అక్కడి ఫొటోలను షేర్‌ చేశారు. ఈ పర్యటనతో స్థానిక పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీనిపై మాల్దీవులు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే.. లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని పోస్టు పెట్టారు. దాంతో సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవ్స్‌ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు.. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అనంతరం సదరు మంత్రులపై వేటు వేసింది.

ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు కూడా ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ సమయంలోనే జమీర్‌ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని ఈ సమావేశంలో జైశంకర్ స్పష్టం చేశారు. తాము పొరుగు వారికి ప్రథమ ప్రాధాన్యం (నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ పాలసీ) విధానానికి కట్టుబడి ఉన్నామని, మాల్దీవులకు అవసరం ఉన్న ప్రతిసారీ ఆదుకున్నామని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు