NEET exam: రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్‌ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్‌ పరీక్షలో ఓ టీచర్‌ నిర్వాకం

NEET exam: నీట్‌ పరీక్షలో ఓ టీచర్‌ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Updated : 10 May 2024 11:13 IST

గోద్రా: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ పరీక్ష జరిగింది. గుజరాత్‌ (Gujarat)లోని ఓ కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు (Malpractice in NEET Exam) చోటుచేసుకున్నాయి. పంచమహల్‌ జిల్లాలోని గోద్రాలో కొందరు అభ్యర్థులు (NEET Aspirants) మెరిట్‌ సాధించేలా ఓ స్కూల్‌ టీచర్‌ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. రూ.10లక్షలిస్తే వారి పరీక్ష తానే రాస్తానని హామీ ఇచ్చాడు. చివరకు అతడి బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు.

గత ఆదివారం గోద్రా స్కూల్‌లో నీట్‌ (NEET) ప్రవేశ పరీక్ష జరిగింది. ఇందులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో అదనపు కలెక్టర్‌, జిల్లా విద్యా అధికారుల బృందం వెంటనే స్కూల్‌కు చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఆ టీచర్‌ నిర్వాకం బయటపడింది. ఈ స్కూల్‌లో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న తుషార్‌ భట్‌.. నీట్‌ పరీక్షకు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఈ ఎగ్జామ్‌లో మెరిట్ కోసం 16 మంది అభ్యర్థులతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్‌ పంపి విద్యార్థి అదృశ్యం

వచ్చిన జవాబులు రాసి.. రాని వాటిని ఖాళీగా వదిలేసి వెళ్లాలని వారికి చెప్పాడు. పరీక్ష పూర్తయిన తర్వాత పేపర్లు తీసుకుని తానే వాటిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు గానూ ఒక్కో అభ్యర్థి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అతడి సలహా మేరకు ఓ అభ్యర్థి ముందుగానే రూ.7లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. విద్యాశాఖ అధికారులు తుషార్‌ భట్‌ను ప్రశ్నించగా ఈ మోసాన్ని అంగీకరించాడు. అతడి మొబైల్‌ నుంచి ఆ 16 మంది అభ్యర్థుల పేర్లు, రోల్‌ నంబర్లను గుర్తించారు. నిందితుడి కారు నుంచి అడ్వాన్స్‌ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తుషార్‌, అతడికి సాయం చేసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని