PM Modi: మీతో ముడిపడిన చారిత్రక క్షణాలెన్నో

‘ఇది అత్యంత భావోద్వేగపూరిత క్షణం. ఈ సభకు చెందిన ఎన్నో చారిత్రక క్షణాలు మీతో ముడిపడి ఉన్నాయి’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ఎం.వెంకయ్యనాయుడును ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు.

Updated : 09 Aug 2022 08:23 IST

వెంకయ్యనాయుడితో ప్రస్థానంపై మోదీ

ఈనాడు, దిల్లీ: ‘ఇది అత్యంత భావోద్వేగపూరిత క్షణం. ఈ సభకు చెందిన ఎన్నో చారిత్రక క్షణాలు మీతో ముడిపడి ఉన్నాయి’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ఎం.వెంకయ్యనాయుడును ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. ఉపరాష్ట్రపతికి వీడ్కోలు సందర్భంగా సోమవారం రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాతృభాషల పరిరక్షణపై ఉపరాష్ట్రపతి చూపిన శ్రద్ధ అనిర్వచనీయమన్నారు. వెంకయ్యనాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను తప్పితే ప్రజా జీవితం నుంచి కాదు’ అని ఉపరాష్ట్రపతి పలుమార్లు చెప్పిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు.

యువతతో నిరంతర అనుబంధం

‘‘ఈ సభకు నేతృత్వం వహించేందుకు మీ పదవీకాలం పూర్తవుతుండొచ్చుకానీ, ప్రజలతో కలవడానికి కాదు. మీ అనుభవాల ప్రయోజనం భవిష్యత్తులో సుదీర్ఘకాలంపాటు దేశానికి, మాలాంటి సాధారణ కార్యకర్తలకు లభిస్తూనే ఉంటుంది. మీరు ఏ పదవిలో ఉన్నా యువత కోసం పనిచేశారు. సభలోనూ ప్రతిసారీ యువ సభ్యులను ప్రోత్సహించారు. యువతరంతో మాట్లాడటానికి విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలకు వెళ్లారు. వారితో నిరంతర అనుబంధం ఏర్పరచుకున్నారు. 

ప్రతి పనిలో కొత్త ఊపిరిలూదారు

మీరు విభిన్న బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమై పనిచేయడం చూశాను. ప్రతి పనిలో కొత్త ఊపిరులూదేందుకు ప్రయత్నించారు. మీ ఉత్సాహం, నిబద్ధతను మేం నిరంతరం చూస్తూనే ఉన్నాం. సమాజం, దేశం, ప్రజాస్వామ్యం గురించి మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మీ అనుభవం యువతకు మార్గదర్శనం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. మీరు రాసిన పుస్తకాల్లోని పద సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీరు దానికి పెట్టింది పేరు. మీ వ్యాఖ్యలు చతురత కలిగి ఉంటాయి. చాలా సహజసిద్ధంగా, భాషను అత్యంత ప్రభావశీలంగా ప్రయోగిస్తూ.. పరిస్థితులను మలుపు తిప్పేలా మీరు చేసే ప్రసంగ ప్రతిభకు నేను నిజంగా అభినందనలు తెలుపుతున్నాను. మీ మాటలు మనసును తాకడంతో పాటు వినడానికి మధురంగానూ ఉంటాయి.

మీ నిబద్ధతకు నిదర్శనం

విద్యార్థి దశలోనే మీరు రాజకీయ జీవితం ప్రారంభించారు. మీరు ఎంచుకున్న పార్టీ దక్షిణాదిలో సమీప భవిష్యత్తులో కనిపించే పరిస్థితి లేదని అప్పట్లో చాలామంది అనేవారు. సామాన్య విద్యార్థి కార్యకర్తగా ప్రారంభమై.. అదే పార్టీ జాతీయ అధ్యక్ష స్థానానికి చేరుకోవడం మీ అవిరళ శ్రమ, నిబద్ధతకు నిదర్శనం. ఎదగడానికి భాష, ప్రాంతం అడ్డంకులు కావని మీరు నిరూపించారు. 

ప్రేమతోనే మందలించారు

మీ నిబద్ధతతో రాజ్యసభలో సభ్యుల హాజరు మెరుగుపడింది. ఎగువ సభ ముందడుగు వేయడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ గుర్తుంటాయి. ధర్మం, కర్తవ్యం గురించి చెప్పేవారే అనుభవజ్ఞులు అనేది నానుడి. మీ నాయకత్వంలో రాజ్యసభ ఈ రెండింటినీ చూసింది. నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ప్రేమతో మందలించారు. మీ మాటలను సభ్యులెవరూ మరోలా భావించలేదు. మీ పని విధానం, అనుభవం సభ్యులందరికీ స్ఫూర్తినిస్తుంది’’ అని మోదీ చెప్పారు.


లాక్‌డౌన్‌నూ సద్వినియోగం చేసుకున్నారు ‘

ఒకచోట కూర్చోవడం అన్నది వెంకయ్యనాయుడికి శిక్షలాంటిది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైతే ఆయన మాత్రం టెలీయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషుల యోగక్షేమాలు తెలుసుకున్నారు’ అని ప్రధాని అన్నారు. ‘‘వెంకయ్యనాయుడి గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా. ఆయనకు వీడ్కోలు పలకడం సాధ్యం కాదు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి అదే సభకు ఛైర్మన్‌ అయిన ఏకైక వ్యక్తి ఆయనే. కరోనా కాలాన్ని ఆయన చాలా నిర్మాణాత్మకంగా ఉపయోగించుకున్నారు. 50 ఏళ్ల జీవన ప్రయాణంలో తారసపడ్డ శ్రేయోభిలాషులందరికీ ఫోన్లు చేసి పలకరించడం ద్వారా ఆయన ఆ సమయంలో ఒక రకంగా టెలీయాత్ర చేశారు. ఆయన ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటారు. ఉపరాష్ట్రపతి పదవిలోకి రావడానికి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని వెంకయ్య బాధపడ్డారు. ఆ అయిదేళ్ల లోటును భర్తీ చేసేందుకు ఇప్పుడు ఆయనకు అవకాశం వస్తుంది. ఎప్పుడు మాతృభాష పేరు వినిపించినా వెంకయ్యనాయుడే గుర్తుకురావాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని