Kashmir Pandits: వరుసలో నుంచోబెట్టి.. కశ్మీరీ పండిట్లను గుర్తించి కాల్పులు

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్‌ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్నవారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్‌ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో

Updated : 17 Aug 2022 07:32 IST

జమ్మూ-కశ్మీర్‌లో సోదరులపై ఉగ్రవాదుల దారుణకాండ
ఒకరి మృతి, మరొకరికి గాయాలు

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్‌ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్నవారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్‌ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శోపియా జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్‌-బదర్‌ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు ముష్కరులు ఉదయం ఆపిల్‌ తోటలోకి వచ్చి అక్కడున్నవారందరినీ వరుసలో నుంచోబెట్టారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నాక.. కశ్మీర్‌ పండిట్లు అయిన సునీల్‌ కుమార్‌ భట్‌, అతడి సోదరుడు(కజిన్‌) ప్రితంబర్‌ కుమార్‌ భట్‌లను పక్కకు తీసుకెళ్లి ఏకే-47 గన్నులతో కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరుల్లో ఒకరు కాల్పులు జరుపుతుండగా, మరొకరు ఆ ఘోరాన్ని తన ఫోన్‌లో చిత్రీకరించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రగాయాలపాలైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సునీల్‌ కుమార్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రితంబర్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఉదంతంతో ఈ ఏడాదిలోనే ముష్కరుల లక్షిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 21కు చేరింది. ఇదిలా ఉండగా చోటిగమ్‌ గ్రామానికి చెందిన సునీల్‌ కుమార్‌ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన అంత్యక్రియల సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో శ్మశానవాటికికు ర్యాలీగా వెళ్లారు. ‘హిందూ, ముస్లిం, సిక్కుల ఐక్యత వర్ధిల్లాలి.. అమాయకుల ప్రాణాలు తీయడాన్ని అంగీకరించం’ అంటూ నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని