తీవ్ర నేరారోపణలున్న వ్యక్తుల్ని ఎన్నికల్లో నిషేధించవచ్చా?

తీవ్రమైన నేరాభియోగాలున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై స్పందించాలని కేంద్ర న్యాయ,

Published : 29 Sep 2022 06:40 IST

మీ అభిప్రాయం చెప్పండి

కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేసులు విచారణలో ఉన్న వారినీ అడ్డుకోవాలని పిటిషనర్‌ విజ్ఞప్తి

దిల్లీ: తీవ్రమైన నేరాభియోగాలున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై స్పందించాలని కేంద్ర న్యాయ, హోంశాఖలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నేరారోపణలు విచారణ దశలో ఉన్నా కూడా అటువంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్‌ కోరారు. ఇటువంటి వారికి సంబంధించి న్యాయ కమిషన్‌, సుప్రీంకోర్టు గతంలోనే పలు సూచనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన 539 మంది సభ్యుల్లో 233 మంది(43%)పై నేరారోపణ కేసులున్నాయని తెలిపారు. 2009 నుంచి ఇటువంటి కేసులున్న ఎంపీల సంఖ్య 109శాతం పెరిగిందని వివరించారు. ఒక ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్‌ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని వెల్లడించారు. హత్య, దోపిడీ, ఇంట్లోకి చొరబాటు, వేధింపులు వంటి తీవ్ర నేరపూరిత కేసులు వాటిలో ఉన్నాయన్నారు. నేర నేపథ్యం ఎంత ఎక్కువగా ఉంటే విజయావకాశాలు అంత అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయని వివరించారు. ఇటువంటి అభ్యర్థులపై రాజకీయ పార్టీలు ఆధారపడడం కూడా పెరిగిపోతోందని తెలిపారు. వీరికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు ఎగబడుతున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు వివిధ రూపాల్లో సహకారమందించే నేరస్థులు దానికి ప్రతిఫలంగా తమకు అనుకూలమైన పనులు చేయించుకోవడం, లబ్ధిపొందడం చేసేవారని తెలిపారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి ప్రవేశించి అధికారిక పదవులను, హోదాలను పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు నేరమయం కావడం వల్ల ప్రజలు స్వేచ్ఛగా, నిజాయతీగా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు