ఆఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌ పరీక్ష పూర్తి

సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనావాలాకు సోమవారం రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించారు.

Updated : 29 Nov 2022 06:16 IST

శ్రద్ధా ఉంగరం మరో ప్రియురాలికి బహూకరణ

దిల్లీ: సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనావాలాకు సోమవారం రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించారు. అయితే దీనికి అతడు పూర్తిగా సహకరించాడో లేదో అన్న విషయం తెలియరాలేదు. గతంలో నిందితుడికి ఆరోగ్య సమస్యతో ఈ పరీక్ష పూర్తికాలేదు. పాలీగ్రాఫ్‌ పరీక్ష పూర్తికావడంతో ఇక నార్కో ఎనాలసిస్‌ పరీక్ష మిగిలింది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మరోపక్క శవాన్ని ముక్కలు చేసేందుకు హంతకుడు ఉపయోగించినట్లుగా భావిస్తున్న ఆయుధాన్ని, శ్రద్ధాకు చెందిన ఓ ఉంగరాన్ని దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ఉంగరాన్ని ఆఫ్తాబ్‌ తన మరో ప్రియురాలికి బహూకరించినట్లు తెలిపారు. హత్య తర్వాత ఆఫ్తాబ్‌ ముంబయి వెళ్లి ఆమెతో బ్రేకప్‌ అయినట్లు శ్రద్ధా స్నేహితులకు కట్టుకథలు చెప్పడంతోపాటు, శ్రద్ధా ఫోన్‌ను ఆమె మిత్రులతో ఛాటింగ్‌ చేసేందుకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

డ్రగ్స్‌ సరఫరాదారుతో సంబంధం?

గుజరాత్‌లోని సూరత్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో ఫైసల్‌ మొమిన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడికి ఆఫ్తాబ్‌ పూనావాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని వాసైలో ఫైసల్‌ ఉండే ప్రదేశంలోనే ఆఫ్తాబ్‌ కూడా ఉండేవాడు. గుజరాత్‌ పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో అతడు దొరికాడు. ఆ సమయంలోనే ముంబయికి చెందిన అంకిత్‌ శిందేే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

వాహనంపై కత్తులతో దాడి

ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్‌ను ల్యాబ్‌ నుంచి జైలుకు తీసుకెళ్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీస్‌ వ్యాన్‌పై దాడి చేశారు. పోలీస్‌ వ్యాన్‌ తలుపులు తెరిచి ఆఫ్తాబ్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వ్యక్తులు శ్రద్ధాకు న్యాయం జరగాలని నినాదాలు చేస్తూ ఆఫ్తాబ్‌ ఉన్న వ్యాన్‌పై  కత్తులతో దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని