Telecom Department: కాల్‌ రికార్డులను రెండేళ్లపాటు భద్రపరచాలి.. కేంద్రం కొత్త రూల్‌!

సాధారణ నెట్‌వర్క్‌లతోపాటు ఇంటర్నెట్‌ ద్వారా చేసిన అంతర్జాతీయ, కాన్ఫరెన్స్, శాటిలైట్ కాల్స్‌ రికార్డులు, సంక్షిప్త సందేశాలను కనీసం రెండేళ్ల పాటు భద్రపరచాలని......

Published : 31 Jan 2022 01:04 IST

దిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతోపాటు ఇంటర్నెట్‌ ద్వారా చేసిన అంతర్జాతీయ, కాన్ఫరెన్స్, శాటిలైట్ కాల్స్‌ రికార్డులు, సంక్షిప్త సందేశాలను కనీసం రెండేళ్ల పాటు భద్రపరచాలని టెలికాం ఆపరేటర్లను కేంద్రం ఆదేశించింది.. టెలికాం విభాగం(డీఓటీ) తాజాగా ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ జారీ చేసింది. గతేడాది డిసెంబరులో సైతం డీఓటీ.. టెలికాం సంస్థలు తమ కాల్ డేటా, ఇంటర్నెట్ వినియోగం రికార్డుల నిల్వను ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి టెలికాం కంపెనీలు శాటిలైట్ ఫోన్ సేవలు మినహా అన్ని రకాల టెలికాం సేవలను అందిస్తున్నాయి.

‘లైసెన్సు పొందిన సంస్థలన్నీ కమర్షియల్‌, కాల్ డేటా, ఎక్స్ఛేంజ్ డిటెయిల్‌, ఐపీ డిటెయిల్‌ రికార్డులను మెయింటేన్‌ చేయాలి. భద్రతా కారణాల దృష్ట్యా పరిశీలన కోసం వాటిని కనీసం రెండేళ్లపాటు భద్రపరచాలి. ఆ తర్వాత టెలికాం విభాగం నుంచి ఎలాంటి అభ్యంతరాలు అందకపోతే ఆ వివరాలను తొలగించవచ్చు. వాయిస్​ మెయిల్స్​, ఆడియో టెక్స్​, యూనిఫైడ్ మెసేజింగ్​ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుంది’ అని సర్క్యూలర్ పేర్కొంది. టాటా కమ్యూనికేషన్స్, సిస్కోస్ వెబెక్స్, ఏటీ అండ్‌ టీ గ్లోబల్ నెట్‌వర్క్ మొదలైన కంపెనీలకు ఈ సవరణలు వర్తిస్తాయి.

టెలికాం విభాగం ఇటీవల ఐఎల్‌డీ లైసెన్స్‌లోనూ సవరణలు చేసింది. ఇది కాల్ రికార్డుల నిర్వహణను అదనంగా ఏడాది పొడిగించడంతోపాటు.. ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను నిల్వ చేసే సదుపాయాన్ని కలిగి ఉంది. శాటిలైట్​ ఫోన్​ కాల్స్​​, డేటా సేవలను అందించడానికి బీఎస్​ఎన్​ఎల్​కు జారీ చేసిన లైసెన్స్‌లోనూ  కేంద్రం ఇదే తరహా సవరణ చేసింది. ఉపగ్రహ ఆధారిత సేవలను అందించే వీశాట్​ లైసెన్స్ కలిగిన ఆపరేటర్లకు కూడా కనీసం రెండేళ్లపాటు కాల్ డేటా, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్​ రికార్డులను నిల్వ చేయడాన్ని తప్పనిసరి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని