ఆనంద్‌ vs ఆనంద్‌: ఆటలో గెలుపెవరిదంటే..?

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్ 2023లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమతమ రంగాల్లో రాణిస్తున్న ఇద్దరు గొప్ప వ్యక్తులు చందరంగంలో పోటీపడ్డారు. అయితే, ఈ ఆటలో ఎవరు గెలిచారో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

Published : 22 Jun 2023 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరేమో ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్త, చదరంగం అంటే ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తి. ఇంకొకరు చదరంగంలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌. అలాంటి వారు చదరంగంలో తలపడితే.. ఆట ఎంత ఉత్కంఠగా సాగుతుందో చెప్పాల్సిన అవసరంలేదు. అలానే.. ఆట చూసే వారికి ఎవరు గెలుస్తారనే కుతూహలం కలగకమానదు. ఈ ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ 2023 (Tech Mahindra Global Chess League 2023). ఆ ఇద్దరు ప్రముఖులు.. పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra), గ్రాండ్ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ (Viswanathan Anand). 

టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ 2023 మొదటి ఎడిషన్‌ పోటీలు దుబాయ్‌ వేదికగా జూన్‌ 21 నుంచి జులై 2 వరకు జరగనున్నాయి. ఈ పోటీల ప్రారంభోత్సవంలో ఆనంద్‌ మహీంద్రా, విశ్వనాథన్‌ ఆనంద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించే క్రమంలో ఆనంద్‌ మహీంద్రా, విశ్వనాథన్‌ ఆనంద్‌తో సరదాగా కాసేపు చెస్‌ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలను ‘ఆనంద్‌ vs ఆనంద్‌’ అనే క్యాప్షన్‌తో..  చెస్‌బేస్‌ ఇండియా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ను ఆనంద్‌ మహీంద్రా రీ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఆటలో ఎవరు గెలిచారని ఊహించిన వారికి ఎలాంటి బహుమతులు లేవు. కానీ, ఏ క్లాసికల్‌ ఓపెనింగ్‌తో ఆటను ప్రారంభించానో ఊహించిన మొదటి వ్యక్తిని తప్పకుండా అభినందిస్తా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు మాత్రం ‘ఇది కేవలం ఆట కాదు. అంతకు మించి. రెండు మేధస్సుల మధ్య జరిగే పోటీ’, ‘మ్యాచ్‌ ఫలితం గురించి మాకు ఎలా తెలుస్తుంది. ఎవరు గెలిచారో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది’ అని కామెంట్లు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని