Rajasthan politics: రాజస్థాన్‌ సంక్షోభానికి త్వరలోనే చెక్‌!

రాజస్థాన్‌ అంశంలో పార్టీ హైకమాండ్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆచార్య ప్రమోద్‌ క్రిష్ణమ్ తెలిపారు.

Published : 13 Nov 2022 01:42 IST

జైపూర్: రాజస్థాన్‌ అంశంపై  పార్టీ హైకమాండ్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆచార్య ప్రమోద్‌ క్రిష్ణమ్ తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ను ప్రధాని మోదీ ప్రశంసిస్తూ మాట్లాడిన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు బయటకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ రాజస్థాన్‌ రాజకీయ పరిస్థితులు త్వరలోనే ఓ కొలిక్కి రానున్నాయి. ఇక్కడి వాతావరణంపై పార్టీ హైకమాండ్‌ దృష్టి సారించింది. త్వరలోనే పార్టీ నాయకత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనుంది’’ అని అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమోద్‌ కృష్ణమ్‌ వ్యాఖ్యానించారు. హైకమాండ్‌ తీసుకోబోయే నిర్ణయానికి పార్టీ ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు.

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గహ్లోత్‌, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు మధ్య గత కొన్ని నెలలుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. తొలిసారిగా జులై 2020లో గహ్లోత్‌ నాయకత్వాన్ని సవాల్‌ చేస్తూ సచిన్‌పైలట్‌తోపాటు 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఆ తర్వాత ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షఎన్నికల్లో గహ్లోత్‌ను బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నించింది. ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకునేందుకు గహ్లోత్‌ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 92మంది ఎమ్మెల్యేలు గహ్లోత్‌ వారసుడిని ఎన్నుకొనేందుకు ఉద్దేశించిన సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టారు. స్పీకర్‌ను కలిసి పైలట్‌ను సీఎంని చేయకుండా అడ్డుకొనేందుకు మూకుమ్మడి రాజీనామా చేస్తామని బెదిరించారు. రాజకీయ సంక్షోభానికి గహ్లోత్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే కారణమని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుల బృందం తేల్చింది. ఆ పరిణామం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానానికి, గహ్లోత్‌కు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని