MiG 21: ఇంటిపై కూలిన మిగ్‌ ఫైటర్‌జెట్‌.. ముగ్గురి మృతి

MiG 21 Crash: రాజస్థాన్‌లో మిగ్‌-21 యుద్ధ విమానం కూలి ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఫైటర్‌ జెట్‌ ఇంటిపై పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 08 May 2023 14:35 IST

జైపుర్‌: భారత వాయుసేన (IAF)కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం (MiG 21 Crash) సోమవారం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌ (Rajasthan)లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. (Aircraft Crash)

వాయుసేన (IAF) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీ శిక్షణలో భాగంగా సోమవారం ఉదయం ఓ మిగ్‌-21 యుద్ధ విమానం సూరత్‌గఢ్‌ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. అయితే కాసేపటికే ఈ ఫైటర్‌జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో .. హనుమాన్‌గఢ్‌లోని డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌.. పారాచూట్‌ సాయంతో యుద్ధవిమానం నుంచి బయటకు దూకేశాడు. దీంతో అతడు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, విమానం కూలిపోవడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘‘ప్రాణ నష్టాన్ని తప్పించేందుకు పైలట్ శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. చివరకు విమానం గ్రామ శివారులో కుప్పకూలింది’’ అని బికనేర్‌ ఐజీ ఓం ప్రకాశ్ తెలిపారు. ఘటనపై భారత వాయుసేన స్పందించింది. పైలట్‌ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.

మిగ్‌-21 తరచూ ప్రమాదాల్లో..

వాయుసేనకు చెందిన మిగ్‌ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. 1971 యుద్ధంలో భారత్‌కు అద్భుత విజయాన్నందించిన ఈ రష్యన్‌ ఫైటర్‌జెట్లు ఇప్పుడు అపకీర్తి మూటగట్టుకుంటున్నాయి. 1971-72 నుంచి ఇప్పటివరకు 400 మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు కూలిపోయినట్లు ఆంగ్ల మీడియా కథనాల సమాచారం. ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు, దాదాపు 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత వాయుసేనలో మిగ్‌-21 విమానాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితోనే గస్తీ, శిక్షణ నిర్వహిస్తుండటంతో మిగ్‌-21లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని