Aditya-L1: సూర్యుడిపై ఇస్రో టార్గెట్‌.. ‘ఆదిత్య-ఎల్‌ 1’ విశేషాలివే..!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సౌర అన్వేషణ కోసం త్వరలోనే ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహం విశేషాలేంటి? ఎందుకు పంపిస్తున్నారు?

Published : 14 Aug 2023 14:54 IST

బెంగళూరు: జాబిల్లి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పంపిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు తీసుకొచ్చారు. సెప్టెంబరు మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.

‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ ఉపగ్రహ చిత్రాలను ఇస్రో సోమవారం సోషల్‌మీడియాలో పంచుకుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.

చంద్రుడికి మరింత చేరువ.. వచ్చే వారమే జాబిల్లిపై అడుగు!

ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) విశేషాలివే..

  • సూర్యుడి (SUN)ని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్‌ ఇది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు.
  • భూమి (Earth) నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న  కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. 
  • ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు.
  • సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌, మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి.

ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రస్తుతం జాబిల్లికి మరింత చేరువైంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23 సాయంత్రం ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. దీన్ని తర్వాత రోజుల వ్యవధిలోనే ఆదిత్య-ఎల్‌  1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని