Child: మూడేళ్ల చిన్నారికి ‘పేరు’ పెట్టిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..!

మూడేళ్ల చిన్నారికి కేరళ హైకోర్టు పేరు పెట్టింది. ఆమె పేరుపై తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడమే దీనికి కారణం.

Published : 01 Oct 2023 19:40 IST

తిరువనంతపురం: భేదాభిప్రాయాలతో వేర్వేరుగా ఉంటున్న ఓ జంట మధ్య వారి పాపకు పేరు పెట్టే విషయంలో వివాదం తలెత్తింది. ఈ విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో.. చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే ఓ పేరును ఖరారు చేసింది. కేరళ (Kerala)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. స్థానికంగా ఓ జంటకు 2020 ఫిబ్రవరిలో ఓ పాప పుట్టింది. ప్రస్తుతం ఆ దంపతులు విడిగా ఉంటున్నారు. పాప మాత్రం తల్లివద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడంతో.. తల్లి ఓ పేరు నమోదు చేసేందుకు యత్నించారు. అయితే, సంబంధిత అధికారి మాత్రం పేరు నమోదుకు తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని స్పష్టం చేశారు.

అయితే, తమ చిన్నారికి ఆ దంపతులు వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరి మధ్య ఎంతకూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు తల్లి.. కేరళ హైకోర్టు (Kerala High Court)ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బెచు కురియన్ థామస్‌.. కోర్టు అధికార పరిధిని వినియోగించుకుని తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జతచేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ‘తల్లి సూచించిన పేరుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పితృత్వంపై వివాదం తలెత్తకుండా తండ్రి పేరు కూడా చేర్చాలి’ అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

₹ 1400 ఖర్చుతో.. ₹ 25 కోట్లు కొట్టేసి!

‘ఒక పేరును ఎంచుకునే సమయంలో.. పిల్లల సంక్షేమం, సాంస్కృతిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆసక్తి, సామాజిక నిబంధనల వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే.. పిల్లల శ్రేయస్సే అంతిమ లక్ష్యం. ఇటువంటి సందర్భాల్లో పిల్లల సంక్షేమమే పరమావధిగా పరిగణించాలి. తల్లిదండ్రుల హక్కులు కాదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. ‘పేరెన్స్‌ ప్యాట్రియా’ అధికార పరిధిని ఉపయోగించుకుని ఆ మూడేళ్ల చిన్నారికి ఓ పేరు ఖరారు చేసినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని